పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే... దొంగలు కూడా ఆ నోట్ల దొంగతనానికి వెనక్కి తగ్గుతున్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.
కొట్టేసిన పర్సులో ఆ నోట్లు చూసి...
Published Thu, Nov 10 2016 12:53 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే... దొంగలు కూడా ఆ నోట్ల దొంగతనానికి వెనక్కి తగ్గుతున్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేసిన దొంగలు అసలు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోతారు. కానీ గ్రేటర్ నోయిడాలో దొంగలు మాత్రం, కొట్టేసిన పర్సును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. దీనికి ప్రధాన కారణమేమిటో తెలుసా? ఆ పర్సులో అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు ఉండటమే. వికాస్ కుమార్...గ్రేటర్ నోయిడా కన్స్ట్రక్షన్ సైట్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్గా బస్ స్టాండు సమీపంలోకి రాగానే, ఓ ఇద్దరు దొంగలు అతని పర్సును కొట్టేసి, పరిగెత్తుకుని పారిపోయారు.
అయితే అతని పర్సులో ఉన్న మూడు నోట్లు ఐదువందల రూపాయలవే ఉన్నాయి. పర్సును అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వికాస్ వెతుకుతుండగానే.. ఆశ్చర్యంగా ఆ దొంగలే అతని ముందు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి వికాస్ ఒక్కసారిగా షాకయ్యాడు. పర్సులో అన్నీ ఐదువందల నోట్లే ఉన్నాయి... రూ.100 నోట్లు ఎందుకు పెట్టుకోలేదంటూ ఆ దొంగలు వికాస్పై దాడికి పాల్పడి పర్సును వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు తమవద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదని, ఒకవేళ బాధితుడు తమల్ని ఆశ్రయిస్తే, దీనిపై విచారణ చేపడతామని కస్నా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ సుధీర్ కుమార్ త్యాగి తెలిపారు. కాగ, బ్లాక్మనీపై ఉక్కుపాదంగా, నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో 500, 2000 కొత్త నోట్లను నేటి నుంచి జారీచేయడం ప్రారంభించారు.
Advertisement
Advertisement