
సీడబ్ల్యూసీది తప్పుడు నిర్ణయం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం దేశానికి, రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు కీడు చేస్తుంది కనుక వెనక్కు తీసుకోవాలని మంత్రి సాకే శైలజానాథ్, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. విభజనపై కాంగ్రెస్ మాత్రమే తప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటూనే మెజార్టీలేని యూపీఏ పక్షాలు చేసే తీర్మానానికి ప్రాధాన్యత ఉండదని స్పష్టంచేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్య ఉద్యమానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. వారు గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ఉద్యమిస్తామని శైలజానాథ్ చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా తాము హైదరాబాద్‌లో దీక్షలు చేయనున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఏ తేదీన దీన్ని నిర్వహించాలి? ఎక్కడ పెట్టాలి? అన్న అంశాలపై అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తొలినుంచి పోరాడుతున్నది కేవలం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికైనా మనసు మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని సూచించారు. చంద్రబాబునాయుడు వంటి అసమర్థుణ్ని ఎక్కడా చూడలేదని, స్థాయికి మించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై అనుచిత, కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే: గాదె
ఒకప్రాంతానికి న్యాయం, మరో ప్రాంతానికి అన్యా యం చేసే విభజన సరైనది కాదని, దీన్ని వెనక్కు తీసుకోవలసిందేనని గాదె వెంకటరెడ్డి స్పష్టంచేశారు. సమైక్యమనే మాట టీడీపీ, వైఎస్సార్సీపీలనుంచి రాకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు విభజనకు లేఖ ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అని వెళ్తే ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరని దుయ్యబట్టారు. విభజనపై కాంగ్రెస్ వెనక్కు వెళ్లకుంటే ఆపార్టీలో ఉండాలో, వద్దో తరువాత ఆలోచిస్తామని గాదె ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు.