మిస్త్రీ సంచలన నిర్ణయం
ముంబై: టాటా -మిస్త్రీ బోర్డ్ వార్ లో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించబడిన సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూపుకు చెందిన లిస్టెడ్ కంపెనీలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే తన పోరాటాన్ని మరింత పెద్ద వేదికకు మార్చుతున్నట్టు ప్రకటించారు.
గత అయిదు దశాబ్దాలుగా తమ కుటుంబం టాటా గ్రూపునకు ఎనలేని సేవలు అందించిందని మిస్త్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీలను దారిలో పెట్టేందుకు ప్రయత్నం చేశాననీ, కానీ రతన్ టాటా నన్ను అడ్డుకున్నారని మిస్త్రీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్ట విరుద్ధంగా తనకు తొలగించారని, గత ఎనిమిదివారులు టాటా గ్రూపు సమాధానం కోసం ఎదురుచూశానని పేర్కొన్నారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి టాటా గ్రూపురక్షణ కోసం న్యాయపోరాటానికి పూనుకున్నట్టు తన లేఖలో తెలిపారు.
టాటా గ్రూపులో ఇటీవలి పరిణామాలు తనను బాగా బాధించాయని పేర్కొన్న మిస్త్రీ ఇకముందు పోరాటానికి మరింత పదునుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. టాటా గ్రూపునకు అన్ని జనరల్ మీటింగ్ లనుంచి తనను తాను తొలగించుకుంటున్నట్టు ప్రకటించారు. టాటా సన్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్ , టాటా పవర్, ఇండియన్ హోటల్స్ లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.