'అలాంటి వాటితో భారత్ ఇమేజ్ దెబ్బతింటుంది'
న్యూయార్క్: దాదాపు వారం రోజులు గడిచిన తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాద్రి ఘటనపట్ల స్పందించారు. అలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అవి దేశ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, ప్రభుత్వ విధానాలను పక్కదారి పట్టిస్థాయని అన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆయనను ఓ మీడియా సంస్థ ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ముస్లిం కుటుంబంపై జరిగిన దాడిని గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. ' భారత్ చాలా పరిపక్వత చెందిన సమాజంగల దేశం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటివల్ల మంచి పేరుకాకుండా చెడు పేరు వస్తుంది.
దీంతోపాటు ప్రభుత్వ విధానాలను అవి పక్కదారి పట్టిస్థాయని కూడా చెప్పగలను. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఏదేమైనా ఓ కుటుంబంపై ఇలా దాడి జరగడం దురదృష్టం. నేను తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్నాను' అని జైట్లీ అన్నారు. గోవధకు సంబంధించి వదంతులు వ్యాపించి గో మాంసం ఓ ముస్లిం ఇంట్లో ఉందని దాద్రిలో కొందరు వ్యక్తులు సామూహికంగా ఆ ముస్లిం కుటుంబంపై దాడి చేయడంతో ఆ ఇంటి పెద్ద చనిపోగా అతడి కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.