ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. చలితీవ్రత పెరిగింది. ఢిల్లీలో సోమవారం ఉదయం డిసెంబర్ నెలలో గత పదేళ్లలో ఎన్నడూలేనంతగా 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా ఐదుడిగ్రీలు తక్కువ. ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతోపాటు తీవ్రమైన చలిగాలు వీయడంతో ప్రజలు వణికిపోయారు. సాయంత్రం చెదురు మదురుగా కురిసిన జల్లులు చలి తీవ్రతను మరింత పెంచాయి.
సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో 1 మిల్లీమీటర్లు, పాలంలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, లద్ధాక్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి మైనస్ 5.3 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే కనిష్టస్థాయి అని అధికారులు తెలిపారు. అలాగే కార్గిల్‌లో మైనస్ 18.9 డిగ్రీలు, లేహ్‌లో మైనస్ 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవికూడా ఈ శీతాకాలంలోకల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచుకురుస్తోంది.