ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖ, విద్యుత్, ప్రణాళిక, ఉన్నత విద్య, ఆర్థిక, సేవలు, విజిలెన్స్ శాఖలు చూస్తారు. ఇక ఆయన నమ్మిన బంటు, కుడిచేయి లాంటి మనీష్ సిసోదియాకు విద్య, ఉన్నత విద్య, ప్రజాపనుల శాఖ, పట్టణాభివృద్ధి, స్థానికసంస్థలు అప్పగించారు. సోమనాథ్ భారతికి పరిపాలనా సంస్కరణలు, న్యాయ, పర్యాటక, కళలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలు ఇచ్చారు. సౌరభ్ భరద్వాజ్కు రవాణా, ఆహార సరఫరా, పర్యావరణ శాఖలు కేటాయించారు.
మంత్రివర్గంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన రాఖీ బిర్లాకు మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, భాషల శాఖలు ఇచ్చారు. దాంతోపాటు జాతీయ రాజధానిలో మహిళల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే బాధ్యతను కూడా ఆమెకే అప్పగించారు. గిరీష్ సోనీకి ఎస్సీ ఎస్సటీ సంక్షేమం, ఉద్యోగావకాశాలు, అభివృద్ధి, కార్మిక శాఖలు ఇచ్చారు. సత్యేంద్ర జైన్కు ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికల శాఖలు అప్పగించారు.