ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు!
స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా నిఘా వర్గాల నుంచి హెచ్చరిక రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వ్యక్తిగత, వాణిజ్య వాహనాలతో సహా అన్ని వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే ఏ ఒక్క వాహనాన్నీ వదలొద్దని ఢిల్లీ అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. ఢిల్లీ పోలీసులతో పాటు కమాండోలు, మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది, షార్ప్ షూటర్లను కూడా ఎర్రకోట చుట్టూ మోహరించారు.
దాదాపు ఆరువేల మంది భద్రతా దళాల సిబ్బందిని ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించినట్లు శుక్లా చెప్పారు. షార్ప్ షూటర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో కూడిన బృందం భద్రతను పటిష్ఠంగా చూస్తుందని ఆయన తెలిపారు. నగరంలోకి ప్రవేశించే, నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నింటిలోనూ ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఉండి, డేగకళ్లతో మొత్తం వాహనాలన్నింటినీ పరిశీలిస్తారు. పత్తర్ గంజ్, జామా మసీదు, ఎర్రకోట చుట్టుపక్కల ఉండే అన్ని ఎత్తయిన భవనాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్లు, మార్కెట్లు, రెస్టారెంట్ల వద్ద నిఘా మరింత పటిష్ఠంగా ఉంటుంది. ఎక్కడైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే చెప్పాల్సిందిగా రిక్షా కార్మికులను కూడా అప్రమత్తం చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్టాపులు, మార్కెట్లు, మాళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కూడా భద్రతను పటిష్ఠం చేశారు.
ఆగస్టు 15 నేపథ్యంలో దేశ రాజధానికి ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉందని తమకు నిఘా వర్గాల నుంచి లేఖ అందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు.