పీవోకే పాక్‌కే చెందుతుంది
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్య డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ ఖండన
జమ్మూ: పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ (పీవోకే) భూభాగం ఆ దేశానికే చెందుతుందని, అది పాక్‌లోనే ఉంటుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భారత్‌లోని కశ్మీర్‌పై మనకే అధికారం ఉంటుందని, అది భారత్‌లో అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇదే విషయాన్ని అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ వద్ద ప్రతిపాదించారని, అయితే దీనికి పాక్ అంగీకరించలేదని అబ్దుల్లా శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని వాజ్‌పేయి తనకు చెప్పారని ఆయన అన్నారు. ఎంతోకాలంగా మనం పీవోకే భారత్‌లో భాగమని చెబుతూ వస్తున్నామని, అయితే దానిని వెనక్కు తీసుకోవడానికి ఇప్పటివరకు ఏమైనా చేశామా? అని ప్రశ్నించారు.
అలాంటిదేమీ జరగలేదని, ఆ భాగం పాక్‌లోనే ఉంటుందన్నారు. ఆమిర్ ఖాన్‌కు అబ్దుల్లా సంఘీభావం ప్రకటించారు. ఆమిర్ వ్యాఖ్యలను కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అబ్దుల్లా వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత నిర్మల్‌సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫరూక్ వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ అక్రమంగా కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకుందని 1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించిందని, పీవోకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.