రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే విభజనపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే విభజనపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలు చెప్పాక ఇప్పుడు ప్రభుత్వ పరమైన మరో కమిటీని ఏర్పాటు చేయాలని కోరటం అనవసరమని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వపరంగా కమిటీ ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర విభజన అంశంలో వివిధ పార్టీలకు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు చెప్పుకోవచ్చన్నారు. అలా కుదరని పక్షంలో అసెంబ్లీలో విభ జన అంశం చర్చకు వచ్చిన సందర్భంలో లేదా బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు పార్టీలకు తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దిగ్విజయ్ బుధవారం ఉదయం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ ఎవరెవరిని కలవబోతోందని ప్రశ్నించగా.. ‘‘బుధవారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులను పిలిచాం.
వారితో మాట్లాడతాం. అభ్యంతరాలన్నీ వింటాం’’ అని బదులిచ్చారు. అలాగే కమిటీ ముందు కాంగ్రెస్ నేతలే కాకుండా, కాంగ్రెసేతరులు సైతం హాజరై వారి అభ్యంతరాలను చెప్పుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని చాలా పార్టీలు ప్రభుత్వపరంగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని ప్రస్తావించగా.. ‘‘అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణబ్ కమిటీకి అభిప్రాయాలు చెప్పాయి. తర్వాత హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్షంలోనూ వారి అభిప్రాయాలను చెప్పాయి. దీంతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటే.. వారికి రెండు వైఖరులు ఉంటే మేమేం చేస్తాం? అయినా పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే హోంమంత్రి వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనను కలవొచ్చు. అలా కానిపక్షంలో అసెంబ్లీలో తీర్మాన సమయంలోనూ, పార్లమెంట్‌లో బిల్లు ముసాయిదా సమయంలోనూ వారి అభిప్రాయాలను వివరించొచ్చు. అలాకాకుండా ఇప్పుడు ప్రభుత్వ కమిటీ అడగటం అసమంజసం’’ అని వ్యాఖ్యానించారు.
‘శాంతిభద్రత’ల్లోనే మార్పు: ‘‘రాష్ట్రంలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. మా నిర్ణయంలోనూ ఎలాంటి మార్పులేదు. అక్కడ మార్పు కేవలం శాంతిభద్రతల పరమైందే. దాన్ని అక్కడి ప్రభుత్వ వ్యవస్థ చూసుకుంటుంది’’ అని దిగ్విజయ్ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. విభజనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఇరు పక్షాలపైనా తాము ఆంక్షలు పెట్టామని చెప్పారు. ‘‘విభజన ప్రక్రియ భావోద్వేగాలతో కూడుకున్నది.. చాలా సున్నితమైన అంశం. ఈ దృష్ట్యా ఎవరూ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఇరు ప్రాంత నేతలకు కఠినంగానే చెప్పాం. ఈ అంశంపై ఎవరూ మాట్లాడకపోవటమే మంచిది’’ అని సూచించారు.