కరువుపై అట్టుడికిన అసెంబ్లీ
దుర్భిక్ష పరిస్థితులను సభ దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేత
♦ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడంపై నిలదీత
♦ గణాంక సహితంగా పరిస్థితిని వివరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ కేంద్ర నిధులనూ రైతులకు దక్కనీయకపోవడంపై మండిపాటు
♦ రైతులకు కనీసస్థాయిలో కూడా రుణాలు ఇవ్వకపోవడంపై ఆవేదన
♦ కరువు మండలాల ప్రకటనలోనూ అన్యాయమేనని ఆగ్రహం
♦ ఇప్పటి వరకూ ఏ రైతుకూ దమ్మిడీ సాయం చేయలేదని మండిపాటు
♦ జగన్‌కు అడుగడుగునా అడ్డు తగిలిన అధికార పార్టీ నేతలు
♦ మరణించిన ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శిస్తానని జగన్ ప్రకటన
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు ఘోర వైఫల్యంపై శాసనసభ అట్టుడికిపోయింది. కరువు బారి నుంచి రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం కర్షకులకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తోందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2013 -14లో పంట నష్టపోయిన రైతులకు రూ.1,690 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన సర్కారు, గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు దక్కాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని రూ.1,067 కోట్ల నుంచి రూ.692 కోట్లకు తగ్గించడంపై నిలదీశారు. ప్రభుత్వ నిర్వాకంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాండవిస్తోన్న కరువు పరిస్థితులపై శాసనసభలో గురువారం స్వల్ప కాలిక చర్చలో ప్రతిపక్షనేత మాట్లాడారు.
ఈ ఏడాది 556 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పెట్టుబడుల రూపంలోనే రైతులు రూ.8 వేల కోట్లకుపైగా నష్టపోయారని, రూ.1,500 కోట్లకుపైగా ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారని చెప్పారు. కలెక్టర్లు పంపిన నివేదికలపై తక్షణం స్పందించి.. అక్టోబర్‌లో కరువు మండలాలను ప్రకటించాల్సిన ప్రభుత్వం డిసెంబర్ వరకూ ఆ అంశాన్నే మరిచిపోయిందని విమర్శించారు. 'డిసెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షం నిలదీస్తుందనే భయంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. 2014 డిసెంబర్ 17 రాత్రి హడావుడిగా 238 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ రైతులకు దమ్మిడీ సహాయం కూడా చేసిన పాపాన పోలేదు. ఏప్రిల్ 22 వరకూ రైతులను ఆదుకోవడంపై ప్రభుత్వం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు. ఆ రోజున కరువుపై కేబినెట్ సమావేశంలో చర్చించి, రైతులకు రూ.1,067 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాలని ప్రకటించారు. జూలై 22న మరోమారు కేబినెట్‌లో చర్చించి ఇన్‌పుట్ సబ్సిడీని రూ.692 కోట్లకు తగ్గించారు. అంటే ఇన్‌పుట్‌సబ్సిడీలో రూ.375 కోట్లు కోత వేశారు.
కరువు తీవ్రత దృష్ట్యా ఇన్‌పుట్ సబ్సిడీని పెంచాల్సింది పోయి తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిది. పోనీ ఆ నిధులైనా రైతులకు ఇచ్చారా అంటే అదీ లేదు. 2014-15కు సంబంధించి ఒకసారి రూ.190 కోట్లు, ఇటీవల రూ.100 కోట్లు మొత్తం రూ.290 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో విడుదల చేశారు. కలెక్టర్లు ప్రతిపాదించిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,500 కోట్లు ఎక్కడ? ఏప్రిల్ 22న కేబినెట్ నిర్ణయించిన రూ.1,067 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కడ? జూలై 22న కేబినెట్ తీర్మానించిన రూ.692 కోట్లు ఎక్కడ? విడుదల చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.290 కోట్లు ఎక్కడ? రైతులను ఇలాగేనా ఆదుకోవడం? 2015-16కు కేంద్రం కేటాయించిన విపత్తు నిధిని 2014-15కు మళ్లిస్తే ఈ ఏడాది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎలా చెల్లిస్తారు?
సాయమంటే నిధులు మళ్లించడమా?
2013-14లో వరుస తుఫాన్‌లు, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అప్పట్లో రాజకీయ పార్టీల నేతలు అందరూ రైతుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రైతుల వద్దకు వెళ్లి దన్నుగా నిలుస్తానని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ.1,690 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చేది లేదని శాసనసభ సాక్షిగా సీఎం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం అలా ఇతర వ్యాపకాలకు మళ్లిస్తోంది.
రైతులకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 554 మిల్లీమీటర్లకుగానూ 378 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని మంత్రిగారే చెప్పారు. కనీసం కరువు ఛాయల గురించి వారికి ఇప్పటికైనా అర్థం అయ్యింది. వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఖరీఫ్‌లో నూనెగింజల పంటలు 11.98 లక్షల హెక్టార్లు సాగు చేయాల్సి ఉండగా కేవలం 5.69 లక్షల హెక్టార్ల(47 శాతం)లో మాత్రమే సాగు చేశారు. పప్పుధాన్యాల పంటలు 25.96 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 15.04 లక్షల హెక్టార్ల(57.9 శాతం)లో సాగు చేశారు, వరి పంట 16.75 లక్షల హెక్టార్లకుగానూ 8.54 లక్షల హెక్టార్ల(50.98 శాతం)లో సాగు చేశారు. మిగతా వారంతా పంట విరామాన్ని ప్రకటించారు. ఒక్క పత్తి పంట మాత్రం 5.84 లక్షల హెక్టార్లకుగానూ 4.49 లక్షల హెక్టార్ల(76 శాతం)లో సాగు అయ్యింది. ఇలా సాగు చేసిన పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. ఖరీఫ్‌లో రైతులు ఇలా పంటలు సాగుచేయకపోవడానికి ప్రకృతి ఒక కారణమైతే, మరో కారణం చంద్రబాబు పుణ్యం.
అప్పుల ఊబిలో రైతన్న....
పంట రుణాలు దక్కక రుణాలు రెన్యూవల్ చేయకపోవడం వల్ల బీమాకు దూరమై రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వ్యవసాయ రుణాలను లక్ష్యం కన్నా అధికంగా పంపిణీ చేయడం రివాజు. 2011-12లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.48 వేల కోట్ల కాగా రూ.58,511 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. 2012-13లో రూ.52,972 కోట్ల లక్ష్యానికి గానూ రూ.73,648 కోట్లు, 2013-14లో రూ.67,224 కోట్లకు గానూ రూ.73,494 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేశారు. కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. 2014-15లో వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం రూ.56,019 కోట్లుకాగా కేవలం రూ.39,938 కోట్లే పంపిణీ చేశారు. 2015-16 ఖరీఫ్‌లో రూ.29,022 కోట్లకుగానూ రూ.21,018 కోట్లనే పంపిణీ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా లక్ష్యం కన్నా తక్కువగానే వ్యవసాయ రుణాలు పంపిణీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇది రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.మరో వైపు చంద్రబాబు మాత్రం రుణమాఫీ కింద తొలి, మలి విడతల్లో రూ.ఏడు వేల కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వ్యవసాయ రుణాలపై 18 నెలల్లో వడ్డీ రూ.15 నుంచి రూ.16 వేల కోట్లు అయింది. అంటే చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నది స్పష్టమవుతోంది.
ఆత్మహత్యల బాటన రైతన్న...
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే 101 మంది అన్నదాతలు ఆత్మార్పణం చేసుకున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 26 రోజుల్లో 46 కుటుంబాలను పరామర్శించాను. ఇంకా ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబం ఇంటికీ నేను వెళ్లి పరామర్శిస్తాను వారి బాధలు, గాథలను అందరికీ వినిపిస్తా’’ అని జగన్ ప్రకటించారు. మార్చగలిగితే మార్చండి రైతుల తలరాతలను అని ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంలో ప్రసార, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జోక్యం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ విపక్ష నేతను ప్రశ్నించారు. ఇందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ చర్చలో పట్టిసీమ గురించి కూడా చెబుతానన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ కరువు అంశానికే పరిమితం కావాలన్నారు. కరువుపై చర్చలో ప్రాజెక్టులు కూడా భాగమేనని జగన్ చెబుతూ పట్టిసీమ అంటే ఎందుకంత భయం అని అధికారపక్షాన్ని నిలదీశారు. స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేయడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
పరిహారం పేరుతో పరిహసిస్తారా?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చను కొనసాగిస్తూ... 'చంద్రబాబు అధికారం చేపట్టాక అనంతపురంలో 101, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 4, తూర్పుగోదావరిలో 5, కృష్ణాలో 2, గుంటూరులో 10, చిత్తూరులో 5, వైఎస్సార్ కడప జిల్లాలో 9, ప్రకాశంలో 7, విశాఖలో ఒకరు, నెల్లూరులో ఒకరు, కర్నూలులో 45 మంది... మొత్తం 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని నేను పరామర్శించి.. వారి బాధలను గాథలను ప్రభుత్వం కళ్లు తెరిపించేలా వివరిస్తాను. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరిహారం పేరుతో పరిహసిస్తున్నారు. రూ.ఐదు లక్షలుగా అందించే పరిహారంలో రూ.1.50 లక్షలు అప్పులు తీర్చడానికి రూ.3.50 లక్షలు కుటుంబ జీవనానికి కేటాయించారు, కానీ ఆ రూ.3.50 లక్షలను బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్‌పై డిపాజిట్ చేసి ఏటా వచ్చే వడ్డీ రూ.35 వేలను అందిస్తున్నారని రైతుల కుటుం బాలు చెబుతున్నాయి. అది కూడా పంటలు సాగుచేసినట్టుగా ఆధారాలు చూపిస్తే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆ డబ్బును ఇస్తామంటున్నారు. పరిహారంగా ఇవ్వాల్సిన సొమ్మును రైతు ల కుటుంబాలకు దక్కనీయకుండా చేస్తూ... భవిష్యత్తులో ఆ రూ.3.50 లక్షలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే కుట్రను చేస్తోంది. చివరకు రూ.ఐదు లక్షల పరిహారాన్ని రూ.రెండు లక్షలకు తగ్గిస్తూ జీవో ఇచ్చారు.' అని మండిపడ్డారు.
ఊళ్లకు ఊళ్లు ఖాళీ
కరువు దెబ్బకు వ్యవసాయం కుదేలైతే ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 'ఒక్క అనంతపురం జిల్లాలోనే నాలుగు నుంచి ఐదు లక్షల మంది బెంగ ళూరుకు వలస వెళ్లారు. రాయలసీమలో 1,500 అడుగుల మేర బోర్లు తవ్వినా చుక్క నీళ్లు దొరకడం లేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు రప్పించి కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కానీ.. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది...'అని జగన్ వ్యాఖ్యానించగా స్పీకర్ మైక్ కట్ చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నిరసనల హోరు మధ్యే మంత్రులు రావెల కిశోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మరో మారు విపక్షనేతపై విరుచుకుపడ్డారు.డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కరువు పరిస్థితుల గురించి కేంద్రానికి తెలియజేస్తామన్నారు. విపక్ష సభ్యుల నిరసన మధ్యనే కరువుపై చర్చను అర్ధాంతరంగా ముగించి స్పీకర్ కోడెల సభను శుక్రవారానికి వాయిదా వేశారు.