అటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తిమీద సాము లాంటిదే.
న్యూఢిల్లీ: అటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తిమీద సాము లాంటిదే. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐదు రాష్ట్రాలకు ప్రత్యేక వరాలేమి ఇవ్వరాదని ఇప్పటికే సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ హెచ్చరికలు చేశాయి. అయినప్పటికీ రాష్ట్రాలకు వర్తించే కేంద్ర పతకాలను అమలు చేయడంలో వాటికి కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా దేశానికి వర్తించే వరాల ద్వారానే మోదీ సర్కార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలను ఆకర్షించవచ్చు.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం సాధారణంగా ప్రతి బడ్జెట్‌లో 96 శాతం నిధులు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు, మౌలిక సౌకర్యాల నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులకు, వాటి వడ్డీలకే ఖర్చవుతాయి. మిగతా నాలుగు శాతం నిధులనే కొత్త పథకాలకు, స్కీమ్‌లకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కొత్త పన్నుల ద్వారా, పన్నుల విస్తతి ద్వారా అదనపు నిధులను సమకూర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ అవకాశం మోదీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రవేశపెట్టిన 2014–15 వార్షిక కేంద్ర బడ్జెట్ ద్వారా లభించింది. మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధి రేటుకు అప్పుడే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండింది. ఆ అవకాశాన్ని జారవిడుచుకుంది.
పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, భారత ఆర్థిక వృద్ధి రేటు ఆరు శాతానికి మించదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి రాయితీలు కల్పించగలదన్నదే సర్వత్రా జరుగుతున్న చర్చ. ఉద్యోగులను, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి మూడున్నర లక్షలకు లేదా ఏకంగా ఐదు లక్షల రూపాయలకు పెంచవచ్చన్నది ఒక అంచనా. అలా చేసినా మోదీ ప్రభుత్వం ఒక్క వర్గాన్ని మాత్రమే ఆకర్షించగలదు. యూపీ ప్రజలకు ఆకర్షించాలంటే రైతు రుణాలను భారీగా మాఫీ చేయాలి. కొత్త స్కీమ్‌లు ప్రకటించాలి. అయితే వాటికి నిధులు ఎక్కుడి నుంచి వస్తాయన్నది మరో చిక్కు ప్రశ్న.
కొన్ని పాశ్చాత్య దేశాల్లో లాగా మోదీ ప్రభుత్వం కూడా ‘యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ స్కీమ్’ను తెస్తుందన్న ఊహాగానాలు గత కొంతకాలంగా సాగుతున్నాయి. ఈ స్కీమ్‌ను భారత్‌లో అమలు చేయాలంటే ఓ కుటుంబానికి సరాసరి ఐదుగురు వ్యక్తులు ఉంటార న్న అంచనాతో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఐదుగురికి ఐదువేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమచేయాలి. ఉద్యోగ, నిరుద్యోగంతో సంబంధం లేకుండా ఇలా ప్రతి పౌరుడికి చెల్లించాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే ఏడాదికి 15.6 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అది స్థూల జాతీయోత్పత్తిలో పది శాతానికి మించిపోతుందని, భారతకున్న ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఇది అసాధ్యమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆహారం, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులపై కేంద్రం ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీల మొత్తం ఈ సంవత్సరానికి 2,31,781 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం సబ్సిడీలను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులను మినహాయిస్తే ‘యూనివర్శిల్ బేసిక్ ఇన్‌కమ్ స్కీమ్’ను అమలు చేయవచ్చు. పెద్ద నోట్ల రద్దుతో పోయిన ఇమేజ్‌ను పెంచుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతటి సాహసానికి ఒడికడుతుందా చూడాలి.