డివిజన్లు యథాతథం
* జీహెచ్‌ఎంసీపై సీఎం కేసీఆర్ నిర్ణయం!
* ఇప్పుడున్న 150 డివిజన్ల కొనసాగింపు
* జనాభా సమాన నిష్పత్తిలో ఉండేలా పునర్వ్వవస్థీకరణ
*ఒక్కో డివిజన్‌కు 44,879 మంది
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం మంత్రివర్గ సహాచరులతో జరిపిన సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. 150 డివిజన్లనే కొనసాగించినా.. జనాభా మాత్రం సమాన నిష్పత్తిలో ఉండేలా డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 జనాభా ఉంది.
ఇందుకు అనుగుణంగా 150 డివిజన్లలో ఒక్కోదానికి 44,879 మందిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇలా కుదరని పక్షంలో 10 శాతం అటూఇటుగా సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం కాన్షీబజారు డివిజన్‌లో అత్యల్పంగా 17,601 జనాభా ఉండగా, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 93,141 జనాభా ఉంది. ఇలాంటి ఈ వ్యత్యాసానికి తావు లేకుండా డివిజన్ల జనాభాలో సమాన నిష్పత్తి ఉండేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం 150 డివిజన్లలో కోర్ సిటీలో 100, శివారులో 50 డివిజన్లు ఉన్నాయి.
పునర్వ్యవస్థీకరణ తర్వాత కోర్ సిటీలో 67, శివారులో 83 డివిజన్లు ఉండనున్నట్లు సమాచారం. డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన జీవో మరో రెండ్రోజుల్లో వెలువడనుంది. వారం, పది రోజుల్లో ముసాయిదా ప్రతిని ప్రజల ముందుంచి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. తొలుత 200 డివిజన్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే జీహెచ్‌ఎంసీ కమిషన ర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 150 డివిజన్లనే ఖరారు చేయాలని నిర్ణయించింది.
కార్పోరేటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే కౌన్సిల్ నిర్వహణలో ఏర్పడనున్న ఇబ్బందులను కూడా కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కమిషనర్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డివిజన్ల ఖరారుకు మార్గం సుగమమైనట్లు చర్చసాగుతుంది. ఇప్పటికే డీలిమిటేషన్‌కు సంబందించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం.