విదేశీ బ్యాంకు ఖాతాలు లేవు: ప్రణీత్ కౌర్
న్యూఢిల్లీ: విదేశాల్లో తనకు బ్యాంకు ఖాతాలు లేవని కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ స్పష్టం చేశారు. విదేశాల్లో నల్లధనం దాచారనే ఆరోపణలతో తనపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆమె స్పందించారు. తన పేరుతో విదేశీ బ్యాంకు ఖాతా ఉన్నందుకు ఆదాయపన్ను తనకు నోటీసు పంపిందని ఆమె తెలిపారు. అయితే విదేశాల్లో తనకు ఎటువవంటి బ్యాంకు ఖాతాలు లేవని ఆమె తెలిపారు. తన పేరుతో విదేశీ బ్యాంకుల్లో ఎకౌంట్లు లేవని కూడా చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ భార్య అయిన ప్రణీత్ కౌర్- మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బడా నాయకులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రణీత్ కౌర్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బ్లాక్మనీ లిస్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.