
ఈ బడిని కట్టిన కూలీలెవరో తెలుసా?
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో మనకు తెలియదు. అంతెందుకు మనం చదువుకున్నా లేదా మన పిల్లలు చదువుకుంటున్న బడిని ఎవరు కట్టారో తెలియదు.
చండీగఢ్: తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో మనకు తెలియదు. అంతెందుకు మనం చదువుకున్నా లేదా మన పిల్లలు చదువుకుంటున్న బడిని ఎవరు కట్టారో తెలియదు. అలా జరుగకూడదనే ఉద్దేశంతోనే పంజాబ్‌లోని సంగ్రూర్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన కూలీలు, నిర్మాణంలో భాగస్వాములైన ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, పెయింటర్లు...అలా 21 మంది పేర్లను ప్రారంభోత్సవ శిలా ఫలకంపై అందంగా చెక్కారు.
అట్టడుగున మాత్రం ఎంపీలాడ్స్ నిధి కింద పాఠశాల నిర్మాణానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగ్వంత్ మన్ పేరును చేర్చారు. అంతేకాదు ఈ పాఠశాలను ప్రారంభించిందీ రాజకీయ నాయకుడు కాదు, అధికారీ అంతకన్నా కాదు. అదే పాఠశాల నుంచి పన్నెండవ తరగతిలో టాపర్లుగా వచ్చిన జస్‌ప్రీత్ కౌర్, సరబ్జీత్ కౌర్‌లతో ప్రారంభోత్సవం చేయించారు. ఈ నవీన ఆలోచన కూడా ఎంపీ భగ్వంత్ మన్‌దే.
గత ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన ఈ ఫాఠశాల భవన నిర్మాణం జూలై 10వ తేదీన పూర్తయింది. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తమ పేర్లు ఉన్నందుకు భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు వాటిని చూసి ముచ్చట పడుతున్నారు. వాటిని తమ కుల వృత్తుల వారికి చూపించి సంబరిపడి పోతున్నారు. సరికొత్త ఆలోచనకు, ధోరణికి శ్రీకారం చుట్టిన పార్లమెంట్ సభ్యుడు భగ్వంత్ మన్‌ను పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు.