బ్లాక్‌మెయిల్ చేస్తోంది
చర్చలకోసం పాక్ అడుక్కోవాల్సిన అవసరం లేదు
హురియత్ చైర్మన్ గిలానీ వ్యాఖ్య
చర్చలే సమస్యకు పరిష్కారం: మీర్వాయిజ్ ఫరూక్
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను మరుగున పడేసేందుకే.. బూటకపు ఉగ్రవాదం అంశాన్ని భారత్ తెరపైకి తెస్తుం దని కశ్మీర్ వేర్పాటువేద నేత హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీ ఆరోపించారు. ఉగ్రవాదం పేరుతో పాక్‌ను కట్టిపడేయటం ద్వారా కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టడమే భారత్ వ్యూహమని ఆయన విమర్శించారు. ‘భారత్‌తో చర్చల కోసం పాకిస్తాన్ అడుక్కోవాల్సిన అవసరం లేదు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకు.. చర్చలు అవసరం లేదని పాక్ స్పష్టమైన సందేశాన్ని పంపించాలి. అంతవరకు కశ్మీర్‌లో శాంతి అసంభవమని స్పష్టం చేయాలి’ అని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌తో గురువారం సమావేశం తర్వాత గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారని హురియత్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘చర్చల ప్రక్రియ ద్వారా సమయాన్ని వృధా చేసి ప్రపంచాన్ని మోసగించాలనేదే భారత్ ఆలోచన.
రెండుదేశాల్లో ఉగ్రఘటనలు జరుగుతున్నా భారత్ మాత్రమే దీన్ని బూచిగా చూపి పాక్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందన్నారు. అయితే.. కశ్మీర్ సమస్యకు భారత్-పాక్ చర్చలే సరైన పరిష్కారమని మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఫరూక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఫరూక్ మరికొందరు వేర్పాటువాద నేతలతో కలసి ఢిల్లీలో పాక్ హైకమిషనర్ బాసిత్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య చర్చలకు తాము వ్యతిరేకం కాదని.. ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయిలో జరగనున్న చర్చలు ఓ మైలురాయిగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎవరు క్లిష్టమైన వైఖరి అవలంబించినా శాంతి ప్రక్రియకు, దక్షిణాసియాలో స్థిరత్వానికి విఘాతం కలుగుతుందన్నారు.