
డోక్లామ్ లాంటి చొరబాట్లు పెరగొచ్చు: ఆర్మీ
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లామ్ ప్రతిష్టంభన తరహా ఘటనలు వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) మీదుగా మరింతగా పెరిగే అవకాశముందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇరుదేశాల సరిహద్దుల విషయంలో యథాతథస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.
స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతమైన టిబేట్‌లో బలగాల తరలింపు, ఆపరేషన్ కొనసాగింపు సామర్థ్యాలను చైనా గణనీయంగా పెంచుకున్నదని ఆయన తెలిపారు. 'సరిహద్దుల్లో యథాతథ పరిస్థితిని మార్చడం ద్వారా డోక్లామ్ కొండప్రాంతంలో ప్రతిష్టంభన చైనా కారణమైంది. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఇవి మరింతగా పెరగొచ్చు' అని జనరల్ రావత్ తెలిపారు. ఇరుదేశాల సరిహద్దుల్లో వివాదాలు, ఎల్‌వోసీ అలైన్‌మెంట్ విషయమై విభేదాలు కొత్త కావని, ఈ వివాదాలను పరిష్కరించేందుకు ఉమ్మడి యంత్రాంగం కూడా ఉందని ఆయన చెప్పారు.