ఘనంగా రామేశ్వర్ రావు షష్టిపూర్తి
* దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
* హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీప్రముఖులు
శంషాబాద్ రూరల్: మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు షష్టిపూర్తి బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడ్రోజులపాటు నిర్వహించిన ఈ వేడుక చివరి రోజున.. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై రామేశ్వర్‌రావు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చైనా పర్యటన ముగించుకుని రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ్నుంచి నేరుగా శ్రీరామనగరం వచ్చారు. వేదికపై శ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశీస్సులు పొందారు. సుమారు అరగంటపాటు కేసీఆర్ ఇక్కడ గడిపారు. వేదిక వద్ద జగన్ ను కలిసిన చిరంజీవి కాసేపు ముచ్చటించారు. అంతకుముందు వేదికపై చినజీయర్‌స్వామి, శ్రీ అహోబిల జీయర్‌స్వామి జ్యోతి ప్రజల్వన చేసి రామేశ్వర్‌రావు దంపతులకు మంగళ శాసనాలు అందజేశారు.
కార్యక్రమానికి రామోజీ గ్రూపు చైర్మన్ రామోజీరావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, చిరంజీవి దంపతులు, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.ప్రకాష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రసమయి బాలకిషన్, రాంచంద్రారెడ్డి, రాజకీ య, సినీ ప్రముఖులు డి.శ్రీనివాస్, దగ్గుపాటి వెంకటేశ్వర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వడ్డె నవీన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దంపతులు, కలెక్టర్ రఘునందన్‌రావు హాజరయ్యారు.
రామేశ్వర్‌రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభారాణి ఇక్కడి దివ్యసాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకే ఇక్కడికి చేరుకున్న ఆమె.. కేసీఆర్ రాకముందే వెళ్లిపోయారు. చిరంజీవి దంపతులు కూడా దివ్యసాకేతాలయంలో పూజలు నిర్వహించారు.