చిట్టచివరి ఎంసెట్టు! | EAMCET- 2017 willbe the last cet, from 2018 national test | Sakshi
Sakshi News home page

చిట్టచివరి ఎంసెట్టు!

Published Mon, Feb 13 2017 1:34 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

చిట్టచివరి ఎంసెట్టు! - Sakshi

చిట్టచివరి ఎంసెట్టు!

- 2017 మే 12న జరిగేదే చివరి పరీక్ష
- 2018 నుంచి ఇంజనీరింగ్‌కు జాతీయ స్థాయిలో ఒకే ఎగ్జామ్‌
- ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సులకు నీట్‌
- అదే బాటలో ఇంజనీరింగ్‌కు జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్‌
- ఏఐసీటీఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
- ఇంటర్మీడియెట్‌ మార్కులకు ఇక నో వెయిటేజీ
- అగ్రికల్చర్, వెటర్నరీ తదితర కోర్సులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌

ఎంసెట్‌... తెలుగు వాకిళ్లలో ఇన్నాళ్లూ ఈ పరీక్షంటే ఓ క్రేజ్‌! ఇంజనీర్‌ కావాలంటే.. ఎంసెట్‌! డాక్టర్‌ అవ్వాలంటే.. ఎంసెట్‌! ఈ పరీక్షలో ర్యాంకు కొట్టడమే లక్షలాది మంది విద్యార్థుల టార్గెట్‌. తమ పిల్లల బంగరు భవితకు బాటలు పరిచేది ఈ పరీక్షేనని నమ్మే తల్లిదండ్రులూ ఎందరో!! ఇన్నాళ్లూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సుమారు 4 లక్షల మంది విద్యార్థులు.. రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణలో 2.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్న ఈ పరీక్ష ఇక అంతర్ధానం కానుంది. 2017 మే 12న జరిగే ఎంసెట్టే చిట్టచివరిది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 1983లో మొదలైన ఎంసెట్‌ సుదీర్ఘ ప్రస్థానానికి 35 ఏళ్ల తర్వాత తెరపడనుంది. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌లకు నీట్‌.. ఇంజనీరింగ్‌కు జేఈఈ(మెయిన్‌) పరీక్షలే పరమావధి కానున్నాయి.

కేంద్రం ప్రకటనే తరువాయి...
ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ద్వారా చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హోమియోపతి, యునానీ, ఆయుర్వేద, యోగ, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలను కూడా నీట్‌ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటి మాదిరే ఇంజనీరింగ్‌ కోర్సుల్లోనూ జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష (జేఈఈ మెయిన్‌) ద్వారా చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రతిపాదించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటిస్తే రాష్ట్రంలో ఎంసెట్‌ రద్దు కానుంది.

ఇంటర్‌ మార్కులకు నో వెయిటేజీ
ఎంసెట్‌లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల ఇంటర్మీడియెట్‌ చదువులు సాగడంతో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం 2007–08లో ప్రొ.నీరదారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఎంసెట్‌ ర్యాంకుల ప్రాధాన్యాన్ని కాస్త తగ్గిస్తూ.. ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. దీంతో 2009 నుంచి ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షలో (జేఈఈ మెయిన్‌) ఈ వెయిటేజీ ఉండే అవకాశం లేదు. జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు ఇన్నాళ్లూ ఇచ్చిన 40 శాతం వెయిటేజీని కేంద్రం 2016 లోనే రద్దు చేసింది. దీంతో కేవలం జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ జేఈఈ మెయిన్‌ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నందున ఇక ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కూడా రద్దు కానుంది. ఎంసెట్‌నే రద్దు చేస్తున్నపుడు దానికి ఇస్తున్న వెయిటేజీ అనే ప్రస్తావనే ఉండదని అధికారులు అంటున్నారు.

ఇంజనీరింగ్‌లో కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షపై అధికారికంగా నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్రంలో ఎంసెట్‌ను రద్దు చేస్టున్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. 2017–18 విద్యా సంవత్సరానికి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్‌ నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 2018–19 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద నీట్, జేఈఈ మెయిన్‌ పరీక్షలకు తెలంగాణ నుంచి నుంచి 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎంటెక్‌ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కూడా జాతీయస్థాయిలో ఒకే పరీక్ష ద్వారా చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు 2018–19 నుంచి జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్, ఐఐటీ కౌన్సిల్‌ నేతృత్వంలో కాకుండా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా కేంద్రం నిర్వహించనుంది.

మిగతా కోర్సులకు ప్రత్యేక పరీక్ష
ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సులు మినహా మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సులతో పాటు బీఫార్మా, బీటెక్‌ బయో టెక్నాలజీ, ఫార్మా–డీ, బీఎస్సీ (అగ్రికల్చర్‌), బీఎస్సీ (హార్టికల్చర్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, యానిమల్‌ హస్‌బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) వంటి కోర్సుల్లో ప్రవేశాలను ఎంసెట్‌ ద్వారా చేపట్టారు. ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలు నీట్, జేఈఈ మెయిన్‌ ద్వారానే చేపట్టనున్న నేపథ్యంలో మిగతా కోర్సుల అడ్మిషన్లను ప్రత్యేక పరీక్ష పరీక్ష ద్వారా చేపట్టాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో నీట్‌ ప్రస్తావన వచ్చిన సమయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు.. వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు తామే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవాలన్న ఆలోచనలు చేశారు. ఎంసెట్‌ రద్దయితే దీనిపై ఏం చేస్తారనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement