‘నీట్‌’ తెలంగాణ టాపర్‌ త్రినాథ్‌ | NEET Telangana topper Trinadh | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ తెలంగాణ టాపర్‌ త్రినాథ్‌

Published Mon, Jul 3 2017 1:36 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

‘నీట్‌’ తెలంగాణ టాపర్‌ త్రినాథ్‌ - Sakshi

‘నీట్‌’ తెలంగాణ టాపర్‌ త్రినాథ్‌

రెండు, మూడు ర్యాంకుల్లో దీపిక, వెంకట హేమంత్‌
- రాష్ట్ర ర్యాంకులు ప్రకటించిన కాళోజీ నారాయణరావు వర్సిటీ
- రాష్ట్రం నుంచి 26 వేల మంది అర్హత!
- వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం..


సాక్షి, హైదరాబాద్‌: జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్‌–2017’లో లక్కిమ్‌శెట్టి అర్నవ్‌ త్రినాథ్‌ తెలంగాణ రాష్ట్ర టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. రెండో ర్యాంకు ఎం.దీపిక, మూడో ర్యాంకు ఎ.వెంకట హేమంత్‌ సాధించారు. గత నెలలో ‘నీట్‌’ ఫలితాల ను సీబీఎస్‌ఈ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో త్రినాథ్‌ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు, దీపిక 24వ ర్యాంకు, వెంకట హేమంత్‌ 32వ ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నీట్‌ రాసిన వారు, అందులో అర్హత సాధించిన విద్యార్థులు, వారి మార్కుల వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సీబీఎస్‌ఈ పంపింది. ఆదివారం రాత్రి ఈ మేరకు ఆ వివరాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు.

జనరల్‌ కేటగిరీ కట్‌ ఆఫ్‌ 131 మార్కులు
తెలంగాణ నుంచి మొత్తం 39,055 మంది ‘నీట్‌’ రాశారు. జనరల్‌ కేటగిరీలో 131 మార్కులను కట్‌ ఆఫ్‌గా ప్రకటించారు. 131 కంటే అధికంగా మార్కులు సాధించిన వారు 24,180 మంది ఉన్నారని వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇక ఎస్సీ, ఎస్టీల కట్‌ ఆఫ్‌ మార్కులు 107గా సీబీఎస్‌ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు 107 నుంచి 131 కట్‌ ఆఫ్‌ మార్కులు సాధించిన వారు 3,586 మంది ఉన్నారు.

అయితే 107–131 మార్కుల మధ్య జనరల్‌ కేటగిరీ వారూ కూడా ఉండొచ్చని, కాబట్టి వారిలో సగం మంది వరకు ఎస్సీ, ఎస్టీలు అర్హత సాధించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రకారం జనరల్, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిపి దాదాపు 26 వేల మంది వరకు రాష్ట్రం నుంచి నీట్‌లో అర్హత సాధించి ఉంటారని వివరించారు. అయితే ఏ కేటగిరీలో ఎవరెవరు ఎంతెంత ర్యాంకులు సాధించారన్నది తెలియడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

త్రినాథ్‌కు 685 మార్కులు
రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన త్రినాథ్‌కు ‘నీట్‌’లో 685 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్‌ దీపికకు 681 మార్కులు, మూడో ర్యాంకర్‌ వెంకట హేమంత్‌కు 680 మార్కులు వచ్చాయి. నాలుగో ర్యాంకు సాధించిన ఎ.అఖిలకు కూడా 680 మార్కులు రాగా, జాతీయస్థాయిలో 32వ ర్యాంకు వచ్చింది.

వారంలో నోటిఫికేషన్‌!
నీట్‌లో మొత్తం 720 మార్కులకు జనరల్‌ కేటగిరీలో అత్యధిక మార్కులు 697. 50 శాతం పర్సంటైల్‌ ప్రకారం కటాఫ్‌ మార్కు 131. గతేడాది కటాఫ్‌ మార్కు 140గా ఉంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో 40 శాతం పర్సంటైల్‌ ప్రకారం కటాఫ్‌ మార్కు 107గా నిర్ధారించారు. ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ ప్రభుత్వమే ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం 3,750 ఎంబీబీఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ విడుదలకు ముందు ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని, ఆ తర్వాతే నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement