విద్యుత్ పన్నుల వాత! | elecricity taxes tobe increased | Sakshi
Sakshi News home page

విద్యుత్ పన్నుల వాత!

Published Sun, Oct 4 2015 4:36 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

విద్యుత్ పన్నుల వాత! - Sakshi

విద్యుత్ పన్నుల వాత!

ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ పన్నులపై కన్నేసింది.

- ప్రభుత్వ పరిశీలనలో కొత్త విద్యుత్ సుంకం చట్టం
- ప్రస్తుతం యూనిట్‌పై 6 పైసల పన్ను
- దానిని 10 నుంచి 20 పైసలకు పెంచే యోచన
- ఏటా ప్రజలపై రూ. 350 కోట్ల భారం  
- బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే 12 శాతం వడ్డీ!
- ప్రభుత్వ ఆమోదం పొందితే త్వరలోనే అమల్లోకి..
 
సాక్షి, హైదరాబాద్:
ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ పన్నులపై కన్నేసింది. విద్యుత్ చార్జీలతో సంబంధం లేకుండా నేరుగా విద్యుత్ వినియోగంపై పన్నును పెంచి.. దాదాపు రూ. 350 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ సుంకం చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం చట్టం ప్రకారం... ఒక్కో యూనిట్ వినియోగంపై సాధారణ వినియోగదారుల నుంచి 6 పైసలు, స్వీయ (కాప్టివ్) వినియోగదారుల నుంచి 25 పైసలు చొప్పున విద్యుత్ సుంకాన్ని వసూలు    చేస్తున్నారు. తాజాగా సాధారణ వినియోగదారులపై విధిస్తున్న విద్యుత్ సుంకాన్ని 6 పైసల నుంచి కనీసం 10 నుంచి 20 పైసల వరకు పెంచాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

విద్యుత్ టారిఫ్‌పై 3 శాతం నుంచి 8 శాతం వరకు విద్యుత్ సుంకాన్ని వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థలు ఇంతకుముందే ప్రభుత్వ అనుమతి కోరాయి. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఈ పెంపు అమలులోకి రానుంది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులపై ఏటా రూ. 350 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులందరిపైనా దీని ప్రభావం పడుతుంది. అయితే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసి స్వీయ అవసరాలకు వినియోగించుకునే కాప్టివ్ వినియోగదారులకు విద్యుత్ సుంకం యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారిపై విద్యుత్ సుంకం పెంపునకు సంబంధించిన ప్రస్తావన ప్రతిపాదనల్లో లేదు.

అది రాష్ట్ర ఖజానాకు..
వినియోగదారుల నుంచి ప్రతి నెలా విద్యుత్ చార్జీలతో పాటే విద్యుత్ సుంకాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) వసూలు చేస్తున్నాయి. విద్యుత్ చార్జీలు డిస్కంలకు వెళుతుండగా... విద్యుత్ సుంకం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. విద్యుత్ సుంకాన్ని చాలా ఏళ్లుగా పెంచిన దాఖలాలు లేవని... కొన్ని దశాబ్దాలుగా యూనిట్‌పై 6 పైసల చొప్పున సుంకం కొనసాగుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో సాధారణ వినియోగదారుల నుంచి ఒక్కో యూనిట్‌పై కనీసం 10 పైసల నుంచి గరిష్టంగా 20 పైసల వరకు విద్యుత్ సుంకం విధిస్తున్నారు. ఆ తరహాలోనే రాష్ట్రంలో వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇక బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే విద్యుత్ సుంకంపై 12 శాతం వడ్డీతో కలిపి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 భారీగా జరిమానాలు..: కొత్త విద్యుత్ సుంకం అమల్లోకి వస్తే విద్యుత్ వినియోగదారులపై జరిమానాలు సైతం భారీగా పెరగనున్నాయి. విద్యుత్ మీటర్లు లేకపోయినా, మీటర్లను ట్యాంపరింగ్ చేసినా కనీసం రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించడంలో జాప్యం చేస్తే రోజుకు రూ. 5 వేలదాకా అదనంగా వసూలు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement