22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు
సెప్టెంబర్ 5న సీట్ల కేటాయింపు జాబితా విడుదల
అదే నెల 10 లేదా 11 నుంచి తరగతులు ప్రారంభం
బీ కేటగిరీ భర్తీకి ప్రత్యేక మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల (వెబ్ కౌన్సెలింగ్)కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ కసరత్తు పూర్తి చేశారు. సమావేశం అనంతరం మండలి చైర్మన్ ప్రొఫెసర్ పి. జయప్రకాశ్‌రావు ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అజయ్ జైన్, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.రమణారావు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ ఎంసెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 22 నుంచి సెప్టెంబర్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 4న వెబ్ ఆప్షన్ల సవరణ, 5న సీట్ల కేటాయింపు జాబితా విడుదల ఉంటుందని జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అడ్మిషన్లు పొందే విద్యార్థులు 6, 7, 8, 9 తేదీల్లో కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 10 లేదా 11న తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 53 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 30 హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేస్తాయని, విద్యార్థుల అడ్మిషన్ల నేపథ్యంలో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూలు తదితర పూర్తి వివరాలతో కూడిన సమగ్ర ప్రకటనను ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ వెబ్‌సైట్ ్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ లో మంగళవారం పొందుపరచనున్నారు. కాగా కన్వీనర్ కోటాలో 2,38,000 సీట్లు, యాజమాన్య కోటాలో 1,02,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బీ-కేటగిరీకి ప్రత్యేక మార్గదర్శకాలు..
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇచ్చే నోటిఫికేషన్‌తో పాటు బీ-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటీసును మంగళవారం జారీ చేయనున్నట్టు జయప్రకాశ్‌రావు తెలిపారు. భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్టు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం యాజమాన్యాలు కనీసం 2 పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని, దరఖాస్తు ఫామ్ నమూనా కళాశాల నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచాలని, అలాగే కళాశాల వెబ్‌సైట్‌లోనూ పొందుపరచాలని సూచించారు. నమూనా దరఖాస్తును కళాశాల తాను అనుబంధంగా ఉన్న యూనివర్శిటీకి మెయిల్ ద్వారా పంపాలని, ఒక కాపీ ఉన్నత విద్యామండలికి పంపాలని సూచించారు. విద్యార్థులు ఈ దరఖాస్తు ఫారాన్ని నింపి, అవసరమైన పత్రాలు జతపరిచి ఎక్నాలెడ్జిమెంట్ పొందగోరుతూ రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని సూచించారు.
అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో స్వీకరించే వెసులుబాటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల దరఖాస్తులన్నింటినీ స్వీకరించిన తరువాత యాజమాన్యాలు ప్రతిభ ఆధారంగా ప్రవేశాల జాబితా తయారు చేసి అడ్మిషన్ల కన్వీనర్‌కు పంపించాలని సూచించారు. అడ్మిషన్ల కన్వీనర్ వీటిని పరిశీలిస్తారని తెలిపారు. ఆ తరువాత వీటి ఆమోదం కోసం ఉన్నత విద్యామండలికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తులు పంపిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాల వెబ్‌సైట్‌లో విధిగా పొందుపరచాలని, అలా లేనిపక్షంలో విద్యార్థులు తమకు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. యాజమాన్య కోటా సీట్లకు కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే వర్తిస్తుందని, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియపై పూర్తిస్థాయిలో తమ పర్యవేక్షక బృందాలు పరిశీలిస్తాయని వివరించారు.
బీ-కేటగిరీ ఎంపిక క్రమం ఇలా..
క న్వీనర్ కోటా సీట్లు 70 శాతం పోగా.. మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేస్తాయి. అయితే 5 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ చేయగా మిగిలిన వాటిలో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జేఈఈ-మెయిన్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. అప్పటికీ సీట్లు మిగిలితే ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారని జయప్రకాశ్‌రావు వివరించారు. ఇందుకు సంబంధించి జీవో 74, 60 తదితర జీవోలు వర్తిస్తాయని చెప్పారు.
షెడ్యూలు ఇలా..
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 19-30
వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 22- సెప్టెంబరు 3
ఆప్షన్ల సవరణ : సెప్టెంబరు 4
సీట్ల కేటాయింపు : సెప్టెంబరు 5
కళాశాలలో చేరిక : సెప్టెంబరు 6, 7, 8, 9
తరగతుల ప్రారంభం : సెప్టెంబరు 10 లేదా 11
19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
Published Tue, Aug 13 2013 8:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement