కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్‌లో.. ప్చ్‌..! | england eleven beats india A in practice match | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా ధోనీ చివరి మ్యాచ్‌లో.. ప్చ్‌..!

Published Tue, Jan 10 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

england eleven beats india A in practice match


ముంబై:
మహేంద్రసింగ్‌ ధోనీ సారథిగా వ్యవహరించిన చివరి మ్యాచ్‌లో సీనియర్‌ జట్టు పోరాడి ఓడింది. ఇంగ్లండ్‌ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 304 పరుగులు చేసింది. కెప్టెన్‌గా చివరి మ్యాచ్‌ ఆడిన ధోనీ మునుపటి ఆటతీరును గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్‌ ఏ జట్టు 304 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఎలెవన్‌కు విసిరింది.

కెప్టెన్ జేజే రాయ్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ కూడా ధాటిగా ఆడింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్లలో బిల్లింగ్ అద్భుతంగా రాణించి 93 పరుగులు చేయగా, జేజే రాయ్ 62 పరుగులు సాధించాడు. ఓపెనర్ హేల్స్ 40 పరుగులు, బట్లర్ 46 పరుగులు, డాసన్‌ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు రాయుడు  97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు.  శిఖర్ ధవన్ (63), యువరాజ్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు జాక్‌ బాల్‌, డేవిడ్‌ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్గా విరాట్‌ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement