పండుగలతో సమతకు బలం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ పండుగలు సమాజానికి కొత్త స్ఫూర్తిని ఇస్తాయని.. దీపావళి కూడా అందులో ఒకటని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పండుగలలో భేదభావాలు ఉండవని.. సమానత్వమనే విలువను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. శనివారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘దివాళీ మిలన్’లో పాల్గొన్న ప్రధాని సందడి చేశారు. మోదీతో సెల్ఫీలు దిగడానికి పాత్రికేయులు అమితోత్సాహం చూపారు. ప్రధాని కూడా అంతే ఉత్సాహంతో పాత్రికేయులతో ఫొటోలు దిగుతూ.. అభివాదం చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మోదీకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దీపావళి పండుగ తర్వాత మిలన్ కార్యక్రమం చేసి ఉంటే ఇంకా బాగుండేదన్నారు.
అయితే తాను బిజీగా ఉండడం వల్ల ఆలస్యం జరిగిందని, ఇవాళ కూడా జరగపోయి ఉంటే క్రిస్మస్ వరకు వేచి ఉండాల్సి వచ్చేదని జోక్ వేసి నవ్వించారు. ఉత్సవాలకు సంబంధించి ఆర్థిక, సామాజికంగా విశ్లేషిస్తే అనేక కథనాలు వెలుగుచూస్తాయన్నారు. గంగా తీరాన నిర్వహించే కుంభమేళా మినీ భారతాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు. తరతరాల నుంచి వస్తున్న పండుగల ద్వారా నిత్యనూతన చైతన్యాన్ని మన పూర్వీకులు అందిస్తున్నారన్నారు. అంతకుముందు అమిత్‌షా మాట్లాడుతూ దీపావళి నుంచి గుజరాత్‌లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కొత్త ఏడాదిలో ప్రజల వ్యక్తిగత జీవితానికి, దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి జరగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, రాజీవ్‌ప్రతాప్‌రూడీ తదితరులు పాల్గొన్నారు.