క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరుగుతున్న ద్రవ్యలోటు నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు ఈక్విటీ ద్వారా నిధులు అందించే ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం వెనక్కుతగ్గింది.
న్యూఢిల్లీ: క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరుగుతున్న ద్రవ్యలోటు నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు ఈక్విటీ ద్వారా నిధులు అందించే ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం వెనక్కుతగ్గింది. వెరసి రూ. 3,574 కోట్ల ప్రతిపాదనను ఆర్థిక శాఖ నిలిపివేసింది. అంతేకాకుండా అవసరమైన నిధులను మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈక్విటీ ప్రతిపాదన ఆలస్యమవుతుందేతప్ప, రద్దుకాలేదని వివరించాయి. ఫలితంగా వెంటనే అవసరమయ్యే నిధులను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. వీటితోపాటు భూములను విక్రయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోగల రూ. 700 కోట్ల విలువైన స్థలాన్ని విక్రయించేందుకు అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.