పన్ను ఎగవేత రోజులు పోయాయని ప్రత్యక్ష పన్నుల కేంద్రం బోర్డ్ (సీబీడీటీ) చీఫ్ అనితా కపూర్ గురువారం స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత రోజులు పోయాయని ప్రత్యక్ష పన్నుల కేంద్రం బోర్డ్ (సీబీడీటీ) చీఫ్ అనితా కపూర్ గురువారం స్పష్టం చేశారు. పన్నులకు సంబంధించి పారిశ్రామిక సమాఖ్య సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పన్నుల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సగటు పన్ను రేటుకు సంబంధించి ప్రస్తుత వ్యవస్థ తక్కువ లాభాలు వచ్చే కంపెనీలకు సైతం భారంగానే ఉందని ఆమె అన్నారు. పన్నులను కనీస స్థాయిలకు తగ్గించుకునే ప్రయత్నాలు సైతం నెరవేరే పరిస్థితి ఉండబోదని, పన్ను మినహాయింపులు పొందేలా వ్యాపారాలు చేయడం ఇకపై కుదరదని అన్నారు.
ఎంత వ్యాపారం జరిగిందన్న విషయాన్ని కంపెనీలు తప్పనిసరిగా చెప్పాల్సిన వ్యవస్థ ఆవిష్కృతమైందని అన్నారు. పన్ను విధానాల్లో క్లిష్టతర అంశాల సడలింపు, ప్రక్రియ సరళీకరణల దిశలో చర్యలు ఉంటాయని పన్ను చెల్లింపుదారులకు హామీ ఇచ్చారు. కంపెనీలకు పన్ను రేట్లు క్రమంగా తగ్గుతాయని, మినహాయింపులను సైతం క్రమంగా తొలగించడం జరుగుతుందని అన్నారు. రూ.4 లక్షల వార్షిక ఆదాయం ఉన్న అనేకమంది తమ ఆదాయాలను తక్కువ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలిందన్నారు.