
క్యాస్ట్రో మరుపురాని వ్యాఖ్యలు
క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో సమీకాలిన చరిత్రపై చెరుగని ముద్రవేశారు. విప్లవానికి ప్రతీకగా, చేగువేరాకు ఆప్తమిత్రుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో స్ఫూర్తినింపారు. తన గురించి, కమ్యూనిజం గురించి వివిధ సందర్భాల్లో ఆయన పేర్కొన్న గుర్తుండిపోయే వ్యాఖ్యలివి..
నన్ను ఖండించండి. ఏం ఫర్వాలేదు. రేపు చరిత్రే నన్ను అర్థం చేసుకుంటుంది.
- శాంటియాగో డి క్యూబాలోని సైనిక బ్యారక్‌లపై దాదాపు ఆత్మాహుతి దాడులు జరపడంపై 1953లో తనను తాను సమర్థించుకుంటూ క్యాస్ట్రో
82మందితో నేను విప్లవాన్ని ప్రారంభించాను. మరోసారి విప్లవాన్ని చేయాలనుకుంటే కేవలం 10, 15మందితో, సంపూర్ణ విశ్వాసంతో చేస్తాను. మీ మీద మీకు విశ్వాసం ఉండి, కచ్చితమైన కార్యాచరణ ఉంటే మీరు చిన్నవారైనా పెద్ద విషయమే కాదు. - 1959లో క్యాస్ట్రో
నా గడ్డన్ని గీయించుకోవాలని నేను అనుకోవడం లేదు. నేను దీనికి అలవాటుపడిపోయాను. నా గడ్డం మా దేశానికి సంబంధించినది అంశం. సుపరిపాలన అందిస్తామన్న మా వాగ్దానం నెరవేరిన నాడు నేను గడ్డాన్ని తీస్తాను. - 1959లో విప్లవం విజయవంతమైన 30 రోజుల అనంతరం సీబీఎస్ చానెల్ ఇంటర్వ్యూలో క్యాస్ట్రో
క్యూబన్ ప్రజారోగ్యం కోసం నేను చేయాలనుకున్న చివరి త్యాగం.. పొగ తాగటాన్ని మానెయ్యడం. కానీ దానిని నేను చేయలేకపోయాను.
- 1985 డిసెంబర్‌లో తాను పొగతాగడం మానేశానని ప్రకటిస్తూ క్యాస్ట్రో
నాలోని భావజాలాలకు, ఆ అసాధారణ వ్యక్తి (జీసెస్ క్రైస్ట్)లోని భావజాలాలకు ఎలాంటి వైరుధ్యాన్ని నేను చూడలేదు
- 1985లో క్యాస్ట్రో
సోషలిస్టు వర్గం కనుమరుగై ఉండి ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనని నేను భావించను.
- 1989లో క్యాస్ట్రో
విప్లవం అందించిన గొప్ప ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే మా వేశ్యలు కూడా పట్టభద్రులే
- డైరెక్టర్ ఆలివర్ స్టోన్ 2003లో తీసిన డాక్యుమెంటరీ ‘కమాండెంట్’పై క్యాస్ట్రో
క్యూబన్ మోడల్ మనకోసం ఇక ఎంతమాత్రం పనిచేయబోదు
- 2010లో అమెరికా జర్నలిస్ట్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్‌తో ఇంటర్వ్యూలో క్యాస్ట్రో.. ఆ తర్వాత తన వ్యాఖ్యను సందర్భోచితంగా తీసుకోలేదని క్యాస్ట్రో పేర్కొన్నారు.
అమెరికాతో చేయబోయే యుద్ధమే నా నిజమైన గమ్యమని నేను గుర్తించాను
- 2004లో ఒలివర్ స్టోన్ తీసిన రెండో డాక్యూమెంటరీ ‘లుకింగ్ ఫర్ ఫిడెల్’ లో క్యాస్ట్రో ప్రారంభ మాటలు
80ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టడం నిజంగా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ పవర్‌గా పేరొందిన పొరుగుదేశం ప్రతిరోజూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా. ఇంతకాలం బతకుతానని నేను అనుకోలేదు.
- 2006 జూలై 21న అర్జెంటినాలో జరిగిన లాటిన్ అమెరికా అధ్యక్షుల సదస్సులో క్యాస్ట్రో