
నేలకు ఢీకొని చల్లాచదురుగా పడిన అల్జీరియా విమాన శకలాలు
బమాకో(మాలి): ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో గురువారం అల్జీరియా విమానం నేలను ఢీకొట్టి ఎగిరిపడి ఉంటుందని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు అభిప్రాయపడ్డారు. బర్కినా ఫాసో నుంచి విమానం అల్జీరియాకు వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. అల్జీరియా విమానం కూలిపోయి 118 మంది మత్యువాతపడిన ఘటనపై నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని, అందుకే ముక్కలుచెక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల విమానంలో ప్రయాణిస్తున్నవారంతా మరణించారు. కొన్ని కుటుంబాలకు చెందిన అందరూ దుర్మరణం చెందారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మందీ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఛిద్రమైన, కాలిపోయిన మృతుల అవయవాలు మాత్రమే సంఘటనాస్థలంలో లభించాయని, దీంతో మతదేహాల గుర్తింపు వీలుకావడం లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చని, అయితే అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉండగా, పూర్తిగా మంటల్లో కాలిపోయిన విమాన శకలాల నుంచి శనివారం రెండో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.