లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై దృష్టిపెట్టిన వర్సిటీ పరిశోధకులు.. నిర్దిష్ట భాగంలో ఎన్ని మూలకణాలు ఉంటున్నాయి? వాటి మధ్య పోటీ ఎలా ఉంటోంది? అన్నది పరిశీలించారు. సాధారణ సందర్భాల్లో పేగులోని ఆయా భాగాల్లో తక్కువ మూలకణాలు మాత్రమే ఉండగా.. కేన్సర్ ఏర్పడిన చోట మాత్రం మూలకణాల సంఖ్య బాగా పెరుగుతోందని, అలాగే వాటి మధ్య మనుగడ కోసం పోటీ సైతం తీవ్రమవుతోందని వీరు కనుగొన్నారు.