విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్: రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఊరట లభించింది. అతణ్ని భారత్‌కు అప్పగించాలన్న కేసు విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. బెయిల్ గడువు సైతం పొగడించారు.
లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో మంగళవారం అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికే.. కేసును జులై 6కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతేకాదు.. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్‌ను మరో ఆరునెలలు(డిసెంబర్ దాకా) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పుతో మాల్యాలో హుషారు రెట్టింపైంది.
నేటి విచారణకు మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా సైతం హాజరై తండ్రికి బాసటగా నిలిచాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను ఎగవేసి, లండన్ పారిపోయిన మాల్యా ఏడాదిన్నర కాలంగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. అతనిని రప్పించేందుకు సీబీఐ, ఈడీ నేతృత్వంలోని అధికారుల బృందం.. బ్రిటన్ న్యాయశాఖతో చర్చలుజరిపి అప్పగింత కేసు నమోదుచేయించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తున్నది.