హెచ్‌సీయుూలో ‘ఫేస్‌బుక్’ వార్
విద్యార్థి సంఘాల పోటాపోటీ ధర్నాలు
ఆందోళనలతో అట్టుడికిన వర్సిటీ
హైదరాబాద్: తమ సంఘ నాయకులను దూషిస్తూ ఏబీవీపీ నాయకుడు ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారని ఓ సంఘం.. తమపై దాడి చేశారని మరో సంఘం నాయకులు పోటాపోటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనలు చేపట్టాయి. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వర్సిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచందర్‌రావు అక్కడికి వచ్చి ఏబీవీపీకి మద్దతు పలికారు. కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి..
అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులను గూండాలుగా పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసిన వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏఎస్‌ఏ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడకున్నా.. అకారణంగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న ఏఎస్‌ఏ సంఘం నాయకులు ప్రశాంత్, విన్సెంట్, అశోక్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులను, అణగారిన వర్గాలను కించపరిచేలా ఏబీవీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, కామెంట్లు దానిలో భాగమేనని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఏఎస్‌ఏకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, టీఎస్‌ఎఫ్, ఓబీసీఏ, టీఆర్‌ఎస్వీ సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్‌ఎ నాయకులను విడుదల చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంపై అధికారులు, అధ్యాపకులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను నిర్ధారణ చేస్తామని వర్సిటీ వీసీ ఆర్‌పీ శర్మ విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.