
మోదీ కంటే ఫడ్నవీస్ బెస్ట్: హజారే
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రశంసలు కురిపించారు.
లాతూర్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఫడ్నవీస్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కంటే మహారాష్ట్ర సర్కారు మంచి పనులు చేస్తోందని అన్నారు.
మహారాష్ట్రలో నీటి సంరక్షణ, పనిచేయని అధికారులకు జరిమానాలు విధించడం వంటి మంచిపనులు చేపట్టారని ఫడ్నవీస్ ను మెచ్చుకున్నారు. తాను రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం లేదని స్పష్టం చేశారు.
కాగా మోదీ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లును హజారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఏ ప్రతిపాదించిన ఈ బిల్లులో రైతు వ్యతిరేక అంశాలు తొలగించకపోతే మరోసారి దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.