రేప్ నుంచి తప్పించుకునేందుకు..
అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ 10 నెలల కొడుకు, భర్తతో కలిసి కదులుతున్న రైలు నుంచి కిందికి దూకేసిన సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. అలీపూర్ద్వార్ జిల్లాలోని బుక్సా టైగర్ రిజర్వ ప్రాంతంలోగల రాజా భట్కావా రైల్వే స్టేషన్ కు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
బాధిత మహిళ (27)కు 10 నెలల కుమారుడున్నాడు. భర్తలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ లో ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగించే ఆమె.. మంగళవారం తమ స్వగ్రామం.. పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాకు దిన్హతాకు బయలుదేరింది. వీళ్లు ఎక్కిన జనరల్ బోగీలోనే 12 మంది యువకుల బృందం ఉంది. ప్రయాణం మొదలైనప్పటి నుంచి మహిళను వేధిస్తున్న యువకుల దురాగతాన్ని న్యూ హసీమరా స్టేషన్ వద్ద రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు బాధిత దంపతులు. అయితే తగినంత సిబ్బంది లేరని అలీపూర్ద్వార్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు సలహా ఇచ్చారు.
పోలీసులు కూడా మహిళలను కాపాడకపోవడంతో దుండగులు మరింత రెచ్చిపోయారు. సిలిగురి స్టేషన్ లో దాదాపు ప్రయాణికులందరూ దిగిపోయారు. జీఆర్పీ గార్డులు కూడా అక్కడే దిగిపోయినట్లు తెలిసింది. రైలు రాజా భట్కావా స్టేషన్ దాటిన తర్వాత మహిళపై అత్యాచాయత్నం చేసిన యువకులు.. అడ్డురాకుండా ఉండేందుకు ఆమె భర్తను కట్టేశారు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడిన భార్యాభర్తలు పది నెలల పిల్లాడితో సహా కదులుతున్న రైలు నుంచి దూకేశారు.
తీవ్రంగా గాయపడ్డ ఆ ముగ్గురూ అలా రక్తాలతోనే అడవిలో రెండు కిలోమీటరర్లు నడిచి రాజా భట్కావా స్టేషన్ కు చేరుకున్నారు. వారిని గుర్తించిన రైల్వే సిబ్బంది బాధితులను అలీపూర్ద్వార్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ ముకుల్ చంద్ర మేథీ చెప్పారు.