బ్లాక్‌ను వైట్ చేసే తెలివైన ఎత్తుగడ!
-
బురిడీ కొట్టిస్తున్న ప్రముఖ హోటల్
పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆకస్మిక నిర్ణయంతో బడాబాబులు తమదైనరీతిలో నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో నోట్లకట్టలు దాచుకున్న సంపన్నులు అక్రమమార్గంలో తమ ధనాన్ని సక్రమంగా చూపించేందుకు తంటాలు పడుతున్నారు.
తాజాగా బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ కూడా తన వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు తెలివైన ఎత్తుగడలతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తోంది. దీనిని గుర్తించిన మిథున్ నోబెల్ అనే వ్యక్తి ఈ బాగోతాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. వినియోగదారులతో పాత తేదీలతో బిల్లులు ఇవ్వడం ద్వారా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు ఆ హోటల్ ప్రయత్నిస్తున్నదని మిథున్ తెలిపారు. ఆయన పోస్టు ఇది.
‘మా ఆఫీస్ సిబ్బంది కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు నేను నిన్న (శనివారం) చర్చ్ స్ట్రీట్‌లోని ఆడిగస్ హోటల్‌కు వెళ్లాను. ఆశ్చర్యకరంగా వాళ్లు కార్డు ద్వారా చెల్లింపులకు నిరాకరించారు. నగదు ద్వారానే ఆర్డర్ తీసుకుంటామన్నారు. డబ్బు చెల్లించి బిల్లు తీసుకున్న నేను.. బిల్లులోని తేదీ చూసి ఆశ్చర్యపోయాను. 1/09/2016 తేదీకి వారు బిల్ ఇచ్చారు. నల్లధనాన్ని మార్చుకునే తెలివైన ఎత్తుగడ ఇది. అమ్మకాల ఖాతాలో మార్పులు చేసి.. గడిచిన నెలలో అధిక అమ్మకాలు చూపించి.. తద్వారా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునే ప్రయత్నం ఇది. చాలామంది తమకు ఇచ్చిన బిల్లులను సరిగ్గా చూడరు. ఇప్పుడైనా అందరూ తమకు ఇస్తున్న బిల్లులోని వివరాలను జాగ్రత్తగా గమనించండి. ప్రతి కొనుగోలుకూ బిల్లు తీసుకోండి. ఆడిగస్ లాంటి ప్రముఖ హోటళ్లు కూడా ఇలా చేయడం సిగ్గుచేటు. నల్లధనంపై ప్రధాని కృషికి మనమంతా సహకారం అందిద్దాం’ అని మిథున్ పేర్కొన్నాడు.