
రైతు ఆత్మహత్యలు కొత్తకాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్తేమీ కాదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్వాకం వల్లే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని.. దీన్ని మరిచి ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. సచివాలయంలో శుక్రవారం పోచారం, తుమ్మల విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రైతులను ఆత్మహత్య చేసుకునేంత దుస్థితికి తీసుకురాలేదని, గత పాలకుల నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రతిపక్షాలు రైతులను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. శాశ్వత సాగునీటి వనరులు కల్పించేంత వరకు ఆత్మహత్యలు ఆపలేమని, నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. వాణిజ్య పంటలు వేసి అధిక పెట్టుబడులు పెట్టి అప్పుల పాలుకావడం వల్ల రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ‘ప్రభుత్వం మీ వెనుక ఉంది. ధైర్యంగా ఉండండి. భార్యా బిడ్డలను అనాధలను చేయకండి’ అంటూ వారు రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 409 మంది ఆత్మహత్య చేసుకున్నారని... వారిలో 141 మందికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఆత్మహత్యల పరిహారం పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని... ముఖ్యమంత్రి విదేశాల నుంచి రాగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న లింబయ్యకు ఒక్క పైసా అప్పు లేదన్నారు.
పంటలు ఎండలేదు..
ఆగస్టుతోపాటు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు ఎంతో మేలుచేస్తాయని, అయితే... అంతకుముందు వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి మాత్రం తగ్గుతుందని పోచారం పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంటల పరిస్థితిని వివరించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొంతమేర పంట నష్టం జరిగిందని అంగీకరించారు.
ప్రత్యామ్నాయంగా సబ్సిడీ విత్తనం ఎంత అవసరమో గ్రామాల వారీగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని బ్యాంకులు కిందిస్థాయి వరకు ఆదేశాలు ఇచ్చాయన్నారు. ఈ ఏడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. లక్ష మంది డ్వాక్రా మహిళలకు రెండు గేదెలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
అక్టోబర్ 27 నుంచి జాతీయ విత్తన సభ...
అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జాతీయ విత్తనసభ జరుగనుందని పోచారం వెల్లడించారు. దీనికి దేశవ్యాప్తంగా విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలు, విత్తన రైతులు, విత్తన రూపకర్తలు 600 మంది వరకు హాజరవుతారని చెప్పారు.