
పీఏలుగా మహిళలు వద్దు : ఫరూక్ అబ్దుల్లా
మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
వారిని నియమించుకుంటే జైలుకే!
కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
మండిపడ్డ మహిళా సంఘాలు, పార్టీలు
తనయుడు ఒమర్ సూచనతో క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలైతే పురుషులు జైలు పాలయ్యే అవకాశం ఉందని ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావటంతో అనంతరం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని తన తనయుడు, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచించటంతో ఫరూక్ కాళ్ల బేరానికి వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ, ఇతర ప్రముఖులు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవటంపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది.
‘ఓ మహిళను కార్యదర్శిగా నియమించుకోరాదని భావిస్తున్నా. కర్మకాలి ఏదైనా ఫిర్యాదు దాఖలైందంటే మేం జైలు పాలు కావాల్సిందే’ అని పార్లమెంట్ భవనం వద్ద ఆయన మీడియాతో పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితికి తాను యువతులను నిందించటం లేదని సమాజమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. అనంతరం ఈ వ్యవహారంపై తన తనయుడితోపాటు పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం కావటంతో ఫరూక్ దిగి వచ్చారు. ‘ప్రజలు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నా. ఎవరినీ కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఏదేమైనా నా మాటల్లో పొరపాటుంటే క్షమాపణలు చెబుతున్నా’ అని చెప్పారు.