
టాటా గ్రూప్ పరిణామాలపై కన్నేసి వుంచాలి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో జరుగుతున్న బోర్డ్‌రూమ్ వివాదం నేపథ్యంలో ఆ గ్రూప్ కంపెనీల పరిణామాలపై కన్నేసి వుంచాలంటూ ఎల్‌ఐసీ, బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దష్ట్యా ఈ గ్రూప్‌పై అప్రమత్తంగా వుండాలని కోరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల్లో ఎల్‌ఐసీతో పాటు బ్యాంకులు కూడా ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడి చేయడం లేదా రుణాలుగా ఇచ్చినందున, డిపాజిటర్ల డబ్బు రిస్క్‌లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థల మీద వుందని ఆ వర్గాలు వివరించాయి. దేశంలో టాటా గ్రూప్ అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక గ్రూప్‌ల్లో ఒకటనడంలో సందేహం లేదని, అయితే టాటా సన్‌స చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత జరుగుతున్న పలు పరిణామాలను గమనించాల్సివుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ. 37,500 కోట్లు..
వివిధ టాటా గ్రూప్ కంపెనీల్లో కేవలం ఎల్‌ఐసీకే రూ. 37,500 కోట్ల విలువైన పెట్టుబడులు వున్నాయి. గ్రూప్‌లో అత్యధిక లాభదాయక కంపెనీ అయిన టీసీఎస్‌లో ఎల్‌ఐసీకి 3.2 శాతం వాటా వుండగా, యూరప్ కార్యకలాపాల కారణంగా తీవ్ర సంక్షోభంలో వున్న టాటా స్టీల్‌లో 13.6 శాతం వాటా వుంది. మరో ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్‌సకు టాటా స్టీల్‌లో 1.17 శాతం వాటా వుంది. ఎల్‌ఐసీకి టాటా పవర్‌లో 13.1 శాతం, టాటా మోటార్స్‌లో 7.13 శాతం, ఇండియన్ హోటల్స్‌లో 8.8 శాతం, టాటా గ్లోబల్ బేవరేజెస్‌లో 9.8 శాతం చొప్పున వాటాలు వున్నాయి.
మిస్త్రీతో కలిసిపనిచేస్తున్నందుకే తొలగించారు-నిర్మల్యాకుమార్
న్యూఢిల్లీ: టాటా సన్‌స మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలసికట్టుగా పనిచేస్తున్నందుకే తనను గ్రూప్ పదవుల నుంచి తొలగించారని టాటా గ్రూప్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించిన నిర్మల్యా కుమార్ ఆరోపించారు. అలాగే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగారు. టాటా సన్‌స చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించిన తర్వాత గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను రద్దుచేశారు. అలాగే ఆ రెండు పదవుల నుంచి కుమార్‌కు స్వస్తిచెప్పారు. టాటా కెమికల్స్ డెరైక్టర్ల బోర్డు నుంచీ కుమార్ గతవారం వైదొలిగారు. తాను 100 మంది విద్యార్థులు, యువ మేనేజర్ల ఎదుట ఒక ప్యానల్‌లో వుండగా, తన తొలగింపు సమాచారాన్ని తనకు అందించారని, ఎందుకు తొలగిస్తున్నారో వివరణ కూడా ఇవ్వలేదంటూ కుమార్ తన బ్లాగ్‌లో ఆవేదన వ్యక్తంచేశారు.