కార్డు పేమెంట్ నెట్వర్క్స్ హ్యాంగ్!
ముంబై : మొట్టమొదటిసారి డెబిట్ కార్డు యూజర్లు నెట్వర్క్ ఫెయిల్యూర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతకుక్రితం 8 శాతంకంటే తక్కువగా ఉన్న ఈ లావాదేవీలు, రికార్డు స్థాయిలో 23 శాతం జంప్ అయ్యాయి. దీంతో కార్డు పేమెంట్ నెట్వర్క్ నెమ్మదించి లావాదేవీలు ఫెయిల్ అవుతునట్టు తెలుస్తోంది. లావాదేవీల విఫలం ఎక్కువగా తప్పుడు పిన్ నమోదు చేయడంతో జరుగుతున్నట్టు సమాచారం.
తప్పుడు పిన్ నమోదు సగటున అప్పట్లో 2 శాతం ఉండేవని, ప్రస్తుతం అవి 11 శాతానికి ఎగిసినట్టు పేమెంట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.. పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు పెరిగాయని, ఈ నేపథ్యంలో కార్డు యూజర్లు నెట్వర్క్ విఫలపరిస్థితులను చవిచూడాల్సి వస్తోందని తెలుపుతున్నాయి.. సాధారణంగా కస్టమర్లు ఒక్కసారి పిన్ నెంబర్ తప్పుగా నమోదుచేస్తే, తర్వాతి రౌండ్లో సరైన పిన్ నమోదుతో లావాదేవీలు జరుపుకోవచ్చు.
కానీ పెద్దనోట్ల రద్దుతో ఎప్పుడూ కార్డు లావాదేవీలు వాడని వారు కూడా ఈ మార్గం వైపుమొగ్గుచూపుతున్నారు. దీనిపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో వారు పలుమార్లు తప్పుడు పిన్ నెంబర్లనే నమోదుచేస్తున్నట్టు పేమెంట్ కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఎక్కువసార్లు తప్పుడు పిన్ ఎంట్రీ చేయడాన్ని పేమెంట్ నెట్వర్క్ సిస్టమ్స్ కార్డు దొంగతనంగా పరిగణించి, కార్డును లేదా పీఓఎస్ మెషిన్ అయినా లాక్ చేస్తాయని పేర్కొంటున్నారు. కార్డు యూజర్లు ఈ విషయాలపై ఫిర్యాదులు ఇస్తుండగా.. తమ నెట్వర్క్లో ఎలాంటి సమస్య లేదని బ్యాంకులు చెబుతున్నాయి.
సమస్యను గుర్తించిన పేమెంట్ కంపెనీలు, రికార్డు స్థాయిలో కార్డు వాడకానికి బ్యాంకులు సన్నద్ధం కాకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. అధిక విలువ కలిగిన నోట్ల విత్డ్రాలతో కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డెబిల్ కార్డు వాడకం 300 శాతానికి ఎగిసిందని పేర్కొన్నారు. భారత్లో మొత్తం 70 కోట్ల డెబిట్ కార్డుదారులున్నారు. చాలామంది ప్రధానమంత్రి జన్ధన్ యోజనా కార్డులను జారీచేసిన వాళ్లే. ఈ కార్డులను ఇప్పటివరకు ఏ స్టోర్లోనూ వాడటం చేయలేదు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటివరకు డెబిట్ కార్డులు వాడని వారు పెద్ద పెద్ద దుకాణాల్లో ఈ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు.