కార్డులు...కష్టాలు!
బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని తీసుకోవడం ఒకప్పుడు ఎంతో ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కొండచిలువను తలపించే లైన్లు, ఎంతకీ తెమలని పనులు, కౌంటర్ దగ్గర సిబ్బంది విసుగుదలలు సర్వసాధారణం. ఇప్పుడు కోరుకున్న క్షణంలో దర్జాగా డబ్బు తీసుకునే సదుపాయం వచ్చేసింది. అవసరాలు, ఆపత్సమయాల్లో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు పొందే సౌకర్యం కూడా లభించింది. అయితే ఈ ప్రక్రియలో పొంచి ఉన్న ప్రమాదాలు ఇప్పటికే అక్కడక్కడ బయట పడుతున్నాయి. కానీ గురువారం వెల్లడైన అంశాలు వీటన్నిటినీ తలదన్నాయి.
బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఆంధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ సహా 19 బ్యాంకులకు సంబంధించిన డెబిట్ కార్డుల సమాచారాన్ని అంతర్జాతీయ నేరగాళ్లు తస్కరించారని వచ్చిన వార్త ప్రజలను భయకంపితుల్ని చేసింది. పర్యవసానంగా 32 లక్షలమంది ఖాతాదారుల కార్డుల్ని బ్యాంకులు స్తంభింపజేయాల్సివచ్చింది. అయితే ఈలోగానే వివిధ ఖాతాల నుంచి భారీ మొత్తంలో నేరగాళ్లు డబ్బు కొల్లగొట్టారంటున్నారు. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కోటి ముప్ఫై లక్షల మొత్తం వరకూ కైంకర్యం అయి ఉండొచ్చునని నిర్ధా రించారు. మరికొన్ని రోజుల తర్వాతగానీ నష్టం ఎంతన్నది నికరంగా తెలియదు.
సైబర్ ప్రపంచం ఆవిర్భావం వెనకే సైబర్ నేరగాళ్లు కూడా పుట్టుకొచ్చారు. ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగం కల్పిస్తున్న సౌకర్యాలను ఆసరా చేసుకుని ఏటా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్... ఇలా ఎన్నో రకాలైన ప్రక్రియ లను వినియోగదారులకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. కలం, కాగితం అవసరం లేకుండా దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సొమ్ము బదిలీ చేసే ఈ ప్రక్రి యలన్నిటిపైనా నేరగాళ్ల నీడ పడటం ఆందోళన కలిగించే విషయం. 2013-14లో ఈ నేరగాళ్లు మన దేశంలో ఆన్‌లైన్ మోసాల ద్వారా రూ. 7,542 కోట్లు కొల్ల గొట్టగా... ఆ మరుసటి సంవత్సరానికల్లా అది రూ. 12,000 కోట్లకు చేరింది. అంటే దాదాపు 60 శాతం పెరిగిందన్న మాట!
ఈ దోపిడీ 27,614 క్రెడిట్ కార్డుల ద్వారా, 3,835 డెబిట్ కార్డుల ద్వారా, 1,969 ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డబ్బుల లావాదేవీలు సమస్తం ఆన్‌లైన్ చేయడం ద్వారా దేశంలో నల్లడబ్బును అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిం చింది. పన్నుల వసూళ్ల ద్వారా గరిష్టంగా ఆదాయాన్ని రాబట్టాలని కోరుకుం టోంది. అదే సమయంలో ఈ లావాదేవీలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పకడ్బందీ భద్రతను కల్పించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు తరచుగా భరోసా ఇస్తోంది. తదనుగుణంగా పటిష్టమైన వ్యవస్థను అమల్లో పెట్టామని బ్యాంకులు చెబుతున్నాయి. తీరా జరిగే మోసాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
సైబర్ ప్రపంచమన్నది అడుగడుగునా మందుపాతరలుండే ప్రమాదకరమైన ప్రాంతంలాంటిది. పైకి అంతా సవ్యంగా ఉన్నట్టు, ప్రశాంతంగా గడిచిపోతున్నట్టు కనిపించినా ఎక్కడో ఏదో అపసవ్యత చోటుచేసుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అలాంటి స్థితి ఏర్పడకుండా చూసే పనిలో ఉన్నవారు అత్యంత అప్ర మత్తంగా ఉండక తప్పదు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా, అలసత్వాన్ని చూపినా జరిగే నష్టం అపారంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో బలహీనమైన లింక్‌ను పట్టుకోవడానికి సైబర్ నేరగాళ్లు రాత్రింబగళ్లు గాలిస్తుంటారు. దొంగ సాఫ్ట్‌వేర్‌ను జొప్పించి సమస్త సమాచారాన్ని క్షణంలో లాగేస్తారు.
దేశంలో ప్రధానంగా వివిధ బ్యాంకుల లావాదేవీల వ్యవహారాలను చూసే మూడు సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్, రూపే సర్వర్లలోకి జొరబడటం ద్వారా ఖాతాదార్ల సమాచారాన్ని నేరగాళ్లు రాబట్టారు. వారు ఉపయోగించిన దొంగ సాఫ్ట్‌వేర్ ఎంత చాకచక్యంతో కూడుకున్న దంటే... వచ్చిన పని కానిచ్చాక ఆ సాఫ్ట్‌వేర్ దానంతటదే కనుమరుగైపోతుంది. సర్వర్లలో అందుకు సంబంధించిన ఎలాంటి జాడల్ని వదిలిపెట్టదు. కొమ్ములు తిరిగిన నిపుణులు కూడా దాన్ని పసిగట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికంగా ఇంతటి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే చెల్లింపు లను నిర్వహించే ఆ మూడు సంస్థలూ, వాటితో అనుసంధానమైన బ్యాంకులు అందుకు దీటైనవిధంగా స్పందించగలిగాయా? తమ తమ సర్వర్లను భద్రంగా ఉంచుకోవడానికి తగిన సాంకేతికతనూ, నైపుణ్యాన్ని సొంతం చేసుకోగలిగాయా? వాటి సంగతలా ఉంచి సైబర్ దాడులకు సంబంధించి వస్తున్న వరస ఫిర్యాదులను కూడా అవి సకాలంలో పట్టించుకోలేకపోయాయి. అలా పట్టించుకుంటే నష్టం పరి మిత స్థాయిలో ఉండేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
గత కొన్ని వారాలుగా ఖాతాదార్లకు వ్యక్తిగత ఈమెయిల్ వినతులు, ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపి, పిన్ నంబర్లు మార్చుకోమని బ్యాంకులు కోరడం నిజమే అయినా...అంతవరకూ జరి గిన దోపిడీని మీడియా ద్వారా బహిరంగపరిచి, మరే స్థాయి ముప్పు పొంచి ఉన్నదో అప్రమత్తం చేసి ఉంటే వేరుగా ఉండేది. ఆ దోపిడీ తీవ్రత అర్ధమయ్యేది. ఆ విషయంలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లకు అది మరింతగా ఉపయోగపడింది. ఆన్‌లైన్ లావాదేవీల వ్యవహారం సౌకర్యవంతమైనదే అయినా అంతకుమించిన ప్రమాదంతో కూడుకున్నదని తాజా ఉదంతం తెలియజెబుతోంది.
ఈ అనుభవమైనా మరింత పటిష్టమైన నిఘాకు దారితీయాలి. ఆధార్ కార్డుల కోసం పౌరుల సమస్త సమాచారం సేకరించడాన్ని పౌర సమాజ కార్యకర్తలు తప్పు బట్టింది ఇలాంటి సమస్యలుంటాయన్న కారణంతోనే. పౌరుల డేటా నేరగాళ్ల చేతుల్లో పడుతున్నదని, దుర్వినియోగమవుతున్నదని... ఎన్నో ఇబ్బందులు తలెత్తు తున్నాయని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైతం గ్రహించి ఆ కార్యక్రమాలు విర మించుకున్నాయి. మనకు పటిష్టమైన ఐటీ చట్టం ఉన్నదని, లీకేజీలు అసాధ్యమని యూపీఏ ప్రభుత్వం నమ్మబలికి ఆధార్‌ను అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు డెబిట్ కార్డుల బాగోతం వెలుగులో ఆధార్‌ను పునస్సమీక్షించడం అవసరమని గుర్తిస్తే మంచిది.