డెబిట్ కార్డులు (ఫైల్ ఫోటో)
ముంబై : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నుంచి డెబిట్ కార్డు వాడకాన్ని పెంచుతూ ఉంటే.. మరోవైపు నుంచి బ్యాంకులు ఆ కార్డులకి షాక్‌లు ఇస్తున్నాయి. ఇష్టానుసారం డెబిట్ కార్డును వాడితే ఇక ఏ మాత్రం బ్యాంకులు ఊరుకోదలుచుకోవట్లేదు. అకౌంట్‌లో డబ్బు లేకపోయినా డ్రా చేయటానికి ప్రయత్నిస్తే.. అందుకనుగుణంగా ఛార్జీలు విధించేందుకు సిద్ధమయ్యాయి. కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే.. మీ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.17 నుంచి రూ.25లను డెబిట్ చేస్తోంది. ఉదాహరణకు.. మీ బ్యాంక్ ఖాతాలో వెయ్యి రూపాయలే ఉన్నాయనుకుండి, ఒకవేళ మీరు 1,100 స్వైప్ చేస్తే.. సరైన నగదు నిల్వ లేదనే సమాచారం వస్తుంది. ఇక నుంచి దాంతో పాటు కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయటానికి ప్రయత్నించినందుకు గాను, ఛార్జీ కూడా బ్యాంకులు వసూలు చేయబోతున్నాయి. దీనిలోనే జీఎస్టీ రేటు కూడా అప్లయ్ అయి ఉంటుంది. ఎస్‌బీఐ ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ ద్వారా డెబిట్ కార్డు స్వైప్ ఫెయిల్ అయిన ప్రతీసారి రూ.17ను వసూలు చేయనుంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ.25 ఛార్జీ వేయబోతున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఇలాంటి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కొంతమంది బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోకుండా.. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని బ్యాంకులు చెబుతున్నాయి. ఒకటికి రెండు సార్లు ఇలా డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంటారని, ఇష్టానుసారం డెబిట్ కార్డులను వాడేస్తున్నారని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత సిస్టమ్‌లో యాంటీ-డిజిటల్ ఎక్కువగా ఉందని, ఎక్కువ సేవింగ్స్ లేనివారికి ఇది అనవసరమైన రిస్క్ అని ఐఐటీ బొంబై ప్రొఫెసర్ అన్నారు. ఈ ఛార్జీలు డిజిటల్ పేమెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఒకవేళ డెబిట్ కార్డులు దుర్వినియోగమవుతున్నాయని బ్యాంకులు భావిస్తే, ఇలాంటి లావాదేవీలను నెలకు ఉచితంగా రెండు అందించాలని దాస్ అన్నారు. చెక్ బౌన్స్ ఛార్జీల కంటే ఇది చాలా చాలా తక్కువ అని మరోవైపు బ్యాంకులు చెబుతున్నాయి. ఇది న్యాయమైన నిర్ణయమేనని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment