న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత‍్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)కు చెందిన నాలుగు బిల్లులపై లోక్ సభలో చర్చ మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన దీనిపై బుదవారం ఏడు గంటల పాటు నిర్విరామంగా చర్చ జరగేందుకు నిర‍్ణయించారు. జిఎస్టి కౌన్సిల్ 12 సమావేశాలు, చర‍్చల అనంతరం కౌన్సిల్ సిఫార్సులను ఆధారంగా వీటిని సభకుపరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేకుండా చట్టాన్ని రూపొందిస్తున్నాం. జీఎస్టీతో వివిధ పన్నులు రద్దవుతాయి అని జైట్లీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా దేశమంతా ఒకే పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా జైట్లీ అన్నారు. ఇదో విప్లవాత్మక బిల్ అని, అందరికీ లబ్ధి చేకూరుస్తుందని జైట్లీ చెప్పారు. ఒకే వస్తువుపై అనేకసార్లు పన్నులను నిరోధించడానికి వీలుగా ఏకీకృత పన్నులు తీసుకొచ్చే యోచనలో జీఎస్‌టీ బిల్లును రూపొందించినట్టు చెప్పారు.
జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్రాలు, కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపి 32 మంది ఉన్నారని, 12 సమావేశాలు జరిగాయని జైట్లీ తెలిపారు. చాలా వరకు ఏకగ్రీవం కోసమే కౌన్సిల్‌లో ప్రయత్నించామని చెప్పారు. ఎస్‌జీఎస్టీ .. సీజీఎస్టీకి ప్రతిబింబమని, ఇది రాష్ట్రాల్లో అమలు చేస్తారని జైట్లీ వెల్లడించారు. జూలై 1నుంచి జీఎస్‌టీ అమలుకు ప్రతిపాదిస్తోందని తెలిపారు.