రాజ్యసభ సభ్యులందరూ రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో కొనసాగుతున్న చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీరప్ప మొయిలీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీఎస్టీ బిల్లు అమలు ఆలస్యం కావడం వల్ల దేశం సుమారు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఆరోపించారు. దీనివల్ల దేశ ప్రజలు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ఆర్థికమంత్రి జైట్లీ ప్రసంగం ముగిసిన వెంటనే మాట్లాడిన వీరప్ప మొయిలీ ప్రభుత‍్వంపై దాడికి దిగారు.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి తీరని అవమానమన్నారు. ప్రభుత‍్వం చెబుతున్నట్టుగా ఇది గేమ్ చేంజర్ కాదనీ, పిల్లదశ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. రాజ్యసభలో కంటే ముందే లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ఆయన మండిపడ్డారు. దీనికి రాజ్యసభపై ఏ మాత్రం గౌరవం ఉన్నా బీజీపీ సభ్యులు రాజీనామా చేయాలని వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగకరమైన బిల్లు గురించి చర్చించాలన్న ఉద్దేశంతోనే సభలో జీఎస్టీ చర్చకు అంగీకరించామన్నారు. జీఎస్టీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేసిందని, కానీ అనేక అవరోధాలు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీఎస్టీ ఐడియాను బీజేపీ తస్కరించిందన్నారు.
జీఎస్టీ బిల్లుపై చర్చ జరగడం అసాధారణమైన అంశమని మొయిలీ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు బీజేపీ తీసుకువచ్చిన సంస్కరణ కాదని, ఇంకా దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. కాగా లోక్‌సభలో జీఎస్టీ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. దీనిపై ఏఐడీఎంకే టీజీ వెంకటేష్‌బాబు తదితరులు మాట్లాడారు.