మరోసారి 'అనంత పద్మనాభస్వామి' సంపద తనిఖీ!
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద మరోసారి వార్తల్లోకెక్కింది. ఆలయ నేల మాళిగలో లభించిన లక్ష కోట్లకుపైగా విలువైన సంపద లెక్కలను రెండోసారి తనిఖీ చేయాల్సిందిగా మాజీ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వినోద్ రాయ్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. గతంలో తాను చేసిన ఆడిట్ పై అసంతృప్తి వ్యక్తంచేసిన వినోద్ రాయి.. అవకాశం ఉంటే మరోసారి తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న నేపథ్యంలో కోర్టు ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించింది.
కాగా, ఆలయంలో లభించిన లక్ష కోట్లకుపైగా విలువైన సంపదను కొదరు పెద్దలు రహస్యంగా కొల్లగొడుతున్నారనే ఆరోపణలు తరచూ వినవచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన మాజీ సొలిసిటర్ జనరల్, అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం 2014, ఏప్రిల్ 18న కోర్టుకు సమర్పించిన నివేదిక కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చింది. ఆలయ నిర్వహణ, సంపద పరిరక్షణలో తీవ్ర లోపాలను గుర్తించినట్లు సుబ్రమణియన్ నివేదికలో తేటతెల్లమైంది. గతంలో నేలమాళిగలోని సంపద మదింపు సమయంలో కల్లారా-బీ అనే గదిని తెరవనివ్వకుండా ట్రస్టీలు అడ్డుకున్నప్పటికీ దాన్ని కొనేళ్ల కిందట తెరిచినట్లుగా ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు ఉన్నాయని నివేదికలో పొందుపర్చారు.
నేలమాళిగలోని సంపదను ఉన్నత స్థాయి వ్యక్తులు వ్యవస్థీకృతంగా వెలికితీసే అవకాశం కూడా ఉందన్నారు. ఈ వ్యవహారంపై చాలా ఉదాహరణలను చూపారు. బంగారు పూతపూసే యంత్రం ఇటీవల ఆలయం ఆవరణలో లభించిందని పేర్కొన్నారు. దీంతో అసలైన బంగారు నగలను దొంగిలించి, వాటి స్థానంలో న కిలీ నగలను ఉంచి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ సంపదపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ డెరైక్టర్ వినోద్ రాయ్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో ఆడిటింగ్ నిర్వహించాలని సిఫార్సు చేశారు. సుబ్రమణియం కమిటీ సిఫార్సుతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాటి కాగ్ వినోద్ రాయ్ సంపద లెక్కలపై ఆడిట్ జరిపారు. ఇది జరిగి ఏడాదిన్నర పూర్తవుతుండగా ఇప్పుడు మరోసారి ఆడిట్ చేయాలంటూ సుప్రీం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.