'ఆ 29మంది మృతికి చంద్రబాబే కారణం'
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
రాజమండ్రి: పుష్కరాల తొలిరోజు ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. క్రైస్తవ శ్మశానవాటిక కోసం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి వచ్చిన సందర్భంగా రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో అరెస్టయిన ఆయన బెయిల్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. ఘాట్ వద్ద షార్ట్ ఫిల్మ్ తీయడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, అందుకు చంద్రబాబు దోషిగా నిలబడాలని పేర్కొన్నారు.
ఓటుకు కోటు ముడుపుల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేకున్నా.. సిగ్గు లేకుండా సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ అని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని, మా ఇంటి మహలక్ష్మి అని పేర్లు మార్చి వీటిని తానే ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. పది రోజుల్లోగా క్రైస్తవుల శ్మశాన వాటికకు భూములు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.