
షాపింగ్ సైట్ హ్యాక్ చేసి.. రూ. 4 కోట్ల మోసం
ఇండియా టుడే షాపింగ్ సైట్ను హ్యాక్ చేసి, కస్టమర్లను రూ. 4 కోట్ల మేర మోసం చేసిన కేసులో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాగిట్ టుడే అనే తమ షాపింగ్ సైట్ హ్యాకింగ్కు గురైందని ఇండియాటుడే గ్రూప్ ఈనెల 1వ తేదీన ఫిర్యాదు చేసినట్లు ఘజియాబాద్ ఎస్పీ ఎస్కే సింగ్ తెలిపారు. ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు గానీ, తమకు ఎలాంటి ప్రయోజనాలు కలగలేదంటూ కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఐటీ నిపుణులు దీన్ని పరిశీలించి.. విజయ్ నగర్లోని ఓ ఇంట్లో ఉన్న నకిలీ కాల్ సెంటర్ ఆధారంగానే ఇదంతా జరుగుతున్నట్లు గుర్తించారు.
అక్కడ పోలీసులు సోదా చేయగా ఏడు కార్డ్లెస్ ఫోన్లు, ఒక ప్రింటర్, ఒక ల్యాప్టాప్, ఏడు సిమ్ కార్డులు దొరికాయి. బ్యాగిట్ టుడే కస్టమర్లను మోసగించినట్లు అంగీకరించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లను మోసం చేయడం ద్వారా నిందితులు దాదాపు రూ. 4 కోట్లు వెనకేశారని సింగ్ చెప్పారు. నిందితుల్లో అజయ్, అవశేష్ అనే ఇద్దరు కవలలతో పాటు ధీరేంద్ర, మనోజ్ అనే మరో ఇద్దరు ఉన్నారు.