అప్పుడే యుద్ధాల నుంచి విముక్తి
న్యూఢిల్లీ: శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన బాటల్లో నడవడం ద్వారా యుద్ధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఢిల్లీలో అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దివస్ వేడుకలకు హాజరైన మోదీ ముందుగా భూకంపం బారిన పడిన నేపాల్ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించారు. అనంతరం రాయబారులు, ఎంపీలు, స్కాలర్లు, బుద్ధ సన్యాసులు కొలువుతీరిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా ఆయన నేపాల్ ప్రస్తావన తీసుకొచ్చారు.
- మోదీ ప్రసంగంలోని కొన్ని హైలెట్స్
- నేడు ప్రత్యేకమైనది.. కానీ కొంత భారమైనది. ఎందుకంటే మనం ఎంతో ప్రేమించే నేపాల్ ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోంది.
- బుద్ధుడు జన్మించిన నేల సంక్లిష్ట దశలో ఉంది.
- ఈ బాధ నేపాల్కు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు.
- ఈ సందర్భంగా నేపాల్ ప్రజలు మనోధైర్యంతో భూకంప సంక్షోభాన్ని దాటాలని కోరుకుంటున్నాను.
- బుద్ధుడు మానవత్వానికి చక్కని సందేశం ఇచ్చాడు. అది నేటికి బతికి ఉంది.
- యుద్ధం నుంచి అందరికీ విముక్తి లభించాలంటే అది ఒక్క బౌద్ధ మార్గం ద్వారానే సాధ్యం.
- మనలో ఉండే ధైర్యం, డబ్బు, అధికారం, చేసే పని అంతా మానవ కళ్యాణానికి(మంచికి) ఉపయోగపడాలనే అనుకోవాలి.
- చిన్నవయసులో భోగభాగ్యాలు అనుభవించిన బుద్ధభగవానుడు తిరిగి ప్రపంచంపై దయ చూపించారు.
- ప్రపంచాన్ని వేధిస్తున్న అన్ని సమస్యలకు సమాధానం బుద్ధిజంలో ఉంది.