నడుస్తున్న రైల్లోనే ఆగిన డ్రైవర్ గుండె
వేటపాలెం(ప్రకాశం): గమ్యం దిశగా సాగిపోతున్న ఓ గూడ్సు రైల్లో డ్రైవర్ గుండె ఆగిపోయింది. శనివారం ఉదయం 9 గంటల సమయంలో బిట్రగుంట నుంచి విజయవాడ వైపు (ద్వారపూడి)నకు గూడ్సు రైలు వెళ్తోంది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం స్టేషన్ దగ్గరలో రైలు ఇంజిన్ క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ వి.సూర్యప్రకాష్(45)కు గుండెలో నోప్పి వచ్చింది. విషయం పక్కనున్న తోటి డ్రైవర్‌కు చెప్పి క్యాబిన్‌లోనే కుప్పకూలి పడిపోయాడు.
కో డ్రైవర్ యూ.హరి వేటపాలెం స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించడంతో ఆయన 108 సిబ్బందిని అప్రమత్తం చేశారు. గూడ్సు రైలు వేటపాలెం చేరుకోగానే సూర్యప్రకాష్‌ను ప్లాట్‌ఫారంపైకి దించారు. 108 సిబ్బంది వచ్చి డ్రై వర్‌ను పరీక్షించి అప్పటికే వృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం చెన్నై నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్తున్న కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేటపాలెం స్టేషన్‌లో ఆపి వృతదేహాన్ని ఆయన స్వస్థలం విజయవాడ తరలించారు.