
చూడి గేదె పొట్టనుంచి బయట పడిన పిల్ల
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ సమీపంలోని రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో పది గేదెలు దుర్మరణం చెందాయి. మృతి చెందిన వాటిలో చూడి గేదె కూడా ఒకటి ఉంది. బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో గల రైల్వేట్రాక్‌పై నుంచి 12 గేదెలు వెళ్తుండగా అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ట్రాక్‌పై నడుస్తున్న గేదెలను ఢీకొట్టి వెళ్లిపోయింది.
దీంతో పది గేదెలు సంఘటనాస్థలంలోనే మరణించగా..మరో రెండు గేదెలు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాయి. మరణించిన గేదెలలో ఒకటి చూలుతో ఉంది. చూడి గేదె పొట్టపై నుంచి రైలుచక్రం వెళ్లడంతో పొట్టలో ఉన్న పిల్ల బయటకు వచ్చి దూరంగా పడి మణించింది. దాని పేగులు చిన్నాభిన్నమై చిందరవందరగా పడ్డాయి.
హృదయ విదారకమైన ఈ సంఘటన సమాచారం తెలిసిన ఉమ్మిరి గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చి చూసి విషయాన్ని రైల్వేపోలీసు అధికారులకు తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గేదెల యజమానులు మూగ జీవుల కళేబరాలను చూసి కంటికీమింటికీ ఏకధారగా విలపిస్తున్నారు.