
గూగుల్ షేరు @ 1,000 డాలర్లు
న్యూయార్క్: ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్‌నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ షేరు ధర అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీ నాస్డాక్‌లో శుక్రవారం ఏకంగా 1,000 డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 61,000) స్థాయిని దాటింది. ట్రేడింగ్ ప్రారంభంలో 13 శాతం దూసుకెళ్లిపోయి 1,007.40 డాలర్లను తాకింది. తద్వారా వెయ్యి డాలర్ల మార్కును అధిగమించిన రెండో అమెరికన్ సంస్థగా గూగుల్ నిల్చింది.
ఇటీవలే ప్రైస్‌లైన్ అనే ఆన్‌లైన్ ట్రావెల్ సైట్ ఈ మైలురాయిని దాటింది. తాజా ఫీట్‌తో గూగుల్ మార్కెట్ విలువ 334 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం తొమ్మిదేళ్ల వ్యవధిలో కంపెనీ షేరు, మార్కెట్ విలువ అనేక రెట్లు పెరిగాయి. 2004లో ఐపీవోకి వచ్చిన గూగుల్ షేరు ధర 85 డాలర్లుగా నిర్ణయించింది. ఐపీవో ద్వారా 1.67 బిలియన్ డాలర్లు సమీకరించింది.
ఆ ఏడాది ఆగస్టులో స్టాక్‌ఎక్స్చేంజీల్లో షేరు 100 డాలర్లకు లిస్టు కాగా.. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 23 బిలియన్ డాలర్లుగా ఉంది. గూగుల్‌లో షేర్లను విక్రయించడం ద్వారా అనేక మంది ఉద్యోగులు రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు.