గూగుల్ సీఈవో అభిమాన నటి ఎవరు?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫేవరెట్ నటి , ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థులతో ముచ్చటించిన పిచాయ్ తన జీవితంలోని కొన్నిముఖ్య ఘట్టాలను ప్రస్తావించారు. జనవరి4 ఇండియాకు వచ్చిన సుందర్ పిచాయ్ 23 ఏళ్ల తరువాత మళ్లీ గురువారం ఐఐటీ ఖరగ్ పూర్ ను సందర్శించారు. డిజిటల్ ఎకానమీ లో ఇండియా ప్రముఖ పాత్ర పోషించనుందనీ, 5-10 ఏళ్లలో భారత మార్కెట్ లో భారీగా స్టార్ట్ అప్స్ కు మంచి అవకాశమన్నారు. ఎంట్రీ లెవల్ (30 డాలర్లు) స్మార్ట్ ఫోన్ తయారీపై దృష్టి పెట్టామని పిచాయ్ పేర్కొన్నారు.
విద్యార్థిగా పలు స్మృతులను నెమరువేసుకున్న పిచాయ్ అనేక ఆసక్తికర విఫయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తనకు ఇష్టమైన భారతీయ నటి అనీ, అలాగే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి తన పేవరెట్ క్రికెటర్ అని చెప్పారు. విరాట్ కోహ్లి ఆట చూడటానికి ఎక్కువగా చూసేవాడినన్నారు. ఫస్ట్ కంప్యూటర్ ను ఐఐటీ ఖరగ్ పూర్ లో చూశాను, 20 ఏళ్ల వయసులో నా మొదటి విమాన ప్రయాణం. కానీ సంవత్సరానికి10 లక్షలమంది విమానాల్లో ప్రయాణించేలా ఇపుడు భారత్ పూర్తిగా మారిపోయింది. రాత్రిళ్లు బాగా మేల్కొని చదవడంతో పొద్దున్న క్లాసులు మిస్ అయ్యేవాణ్ని. నేనూ క్లాసు లు బంక్ కొట్టేవాణ్ణి. హాస్టల్ ఫుడ్ లో పప్పా , సాంబారా అని ఎదురు చూసే వాణ్ణని, తనకు హిందీ అంత బాగా రాదంటూ తన ఐఐటీ రోజులను గుర్తు చేసుకున్నారు.
అనేక విషయాల్లో ఆసక్తి చూపించాలని జీవితంలో సాహసాలు చేయడానికి ప్రయత్నించడం ముఖ్యమని విద్యార్థులకు చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగాఉందని ఇది మారాలని ఆయన సూచించారు. ఐఐటీ లో సీటు రావడానికి హార్డ్ వర్క్ తో కూడుకున్నదని, ఎనిమిదివ తరగతి నుంచే ఐఐటీ విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఏప్రిల్ పూల్ డే రోజు గూగుల్ ఇంటర్వ్యూ జరిగిందనీ, దీంతో నమ్మకం కుదరలేదనీ, నిజంగా జోక్ ఏమో అనుకున్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఐఐటి ఖరగ్ పూర్ ను గూగుల్ డూడుల్ గా చూడొచ్చా అని ప్రశ్నించినపుడు.. అవకాశాలు తక్కువే కానీ.. తమ టీంకు మెయిల్ పెట్టమని సూచించారు. గూగుల్ లో్ ఉద్యోగం సాధించడం ఎలా అని మరో ఐఐటీయన్ ప్రశ్నించినపుడు.. త్వరలోనే ఖరగ్ పూర్ లో గూగుల్ క్యాంపస్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
కాగా 1993 లో ఐఐటీ ఖరగ్ పూర్ లో లోహశోధన ఇంజనీరింగ్, బిజినెస్ వార్టన్ స్కూల్ నుంచి ఎంబిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సుందర్ పిచాయ్ 2004 లో గూగుల్ సంస్థలో చేరారు. అనంతరం ఆగష్టు 2015 లో గూగుల్ సీఈఓగా నియమితులైన సంగతి తెలిసిందే.