గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు
►కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయంగా మారింది
►సామాన్యులకు వైద్యం మిథ్యగా మారింది
►సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు జిల్లాలను దత్తత తీసుకోవాలి
►ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా సదస్సులో ప్రసంగం
హైదరాబాద్: అతి త్వరలో తాను సాధారణ పౌరుడిని కాబోతున్నానంటూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సాధారణ పౌరుడిని కాబోతున్నానని చెప్పారు. వైద్య విజ్ఞాన రంగంలో నూతన అవిష్కరణలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యుడిని వైద్యానికి దూ రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైద్య సంరక్షణ సామాజిక బాధ్యత. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణ ప్రజలకు వైద్యం మిథ్యగా మారింది.
వ్యవసాయరంగంలో మాదిరి వైద్య రంగంలో కూడా క నీస మద్దతు ధర స్థిరీకరించాలి. కార్పొరేట్ వైద్య రంగంలో ధనార్జనే ధ్యేయం కావడంతో నైతిక విలువలు కానరావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా కొన్ని జిల్లాలను దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి వైద్యుడు (ఫ్యామిలీ ఫిజీషియన్) పూర్తిగా కనుమరుగై పోయాడు. జనరిక్ మందుల ధరలు బ్రాండెడ్ ఔషధాల కన్నా తక్కువగా ఉన్నాయి. వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ దేశంలో అతిపెద్ద రంగ మనీ, 2020 నాటికి మెడికల్ టూరిజం ద్వారా 32 కోట్ల మంది భారత్‌ను సందర్శించనున్నారని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ సి.డి.అర్హా చెప్పారు. వైద్య రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, తెలంగాణ, ఏపీలో కొత్తగా మెడికల్, నర్సింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి సూచించారు.
దంత వైద్యంలో ప్రత్యూషకు అవార్డు
దంత వైద్యంలో మెరుగైన వైద్య సేవలందిస్తున్న ప్రత్యూషకు బెస్ట్ హెల్త్‌కేర్ అండ్ ఫార్మా ప్రొఫెషనల్ అవార్డు లభించింది. ఆమె కిమ్స్‌లో డెంటల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. వైద్యులు వినోద్ ప్రవీణ్ శర్మ, సమీర్ భాటి, ఉదయ్ కృష్ణ మైనేని, అమిత్ డాంగ్, నబిత్ కపూర్, పి.ఎల్.కె.ఎం.రావు, ఎంవీవీ నాగేశ్వర్ రెడ్డి, శివరాజు, ప్రదీప్ రెడ్డి, కౌషిక్ రెడ్డి కూడా ఈ అవార్డు అందుకున్నారు.
జీవిత సాఫల్య అవార్డు గ్రహీతలు..
డాక్టర్ రాబర్ట్ వాహ్: ప్రెసిడెంట్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్
ప్రొఫెసర్ డి.బాలసుబ్రమణియన్: డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్
డాక్టర్ ఆంథోని జె డెస్టిఫానో: అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ పూర్వ అధ్యక్షుడు
డాక్టర్ సయీద్ ఖురేషి- సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, థెరాపెటిక్ ప్రోడక్ట్స్ డెరైక్టరేట్, కెనడా
డాక్టర్ జెర్రీ సి.పార్కర్- అసోసియేట్ డీన్ ఫర్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి, అమెరికా
డాక్టర్ జి.ఎన్.సింగ్-డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
డాక్టర్ పి.వి.అప్పాజీ- డెరైక్టర్ జనరల్, ఫార్మాక్సిల్.